Sep 18,2023 00:27

ప్రజాశక్తి - చెరుకుపల్లి
డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్లకు అడ్డంగా తవ్విన గుంటలు పూడ్చకుండా వదిలేశారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అడ్డదిడ్డంగా రహదారులు వెంబడి గుంటలు తవ్వి ప్రజలకు నరకం చూపిస్తున్నారు. 216ఏ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చెరుకుపల్లి సెంటర్లో రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ పనులు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. నిర్మాణ గుత్తేదారు గ్రామంలోని ప్రధాన రహదారుల వెంబడి గుంటలు తవ్వి రోడ్లను మూసివేశారు. దీంతో గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఎక్కువ దూరం తిరిగి రావాల్సి వస్తుంది. పాఠశాల బస్సులు ఎక్కువ దూరం తిరిగి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరుకుపల్లి ప్రధాన సెంటర్లో అంబేద్కర్ విగ్రహం రహదారి మధ్యలో ఉండటంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్య నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో నీటిపారుదల లేక, అంతర్గత రహదారులలో మురుగునీరు నిలబడి దోమలు, దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా జాతీయ నిర్మాణ సంస్థ అధికారులు వెంటనే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.