Oct 10,2021 12:34

అప్పుడే విప్పిన పాము పడగలా
స్వరాన్ని బిగ్గరగా చేసి నా జాడ అది
నేను ఫలానా దూలానికి వేలాడానని
స్వేచ్ఛగా నువ్వు ప్రకటించుకున్నట్లు
నేనెలా ప్రకటించుకోను ?

ఏ కొమ్మకు పుట్టానో,
ఏ ఆకు చాటున ఏడ్చానో
రాత్రులను లెక్కలేసుకుంటూ
ఎన్ని నిప్పురవ్వలను
నా కన్నుల్లో ఆర్పుకున్నానో
నీకెలా చెప్పేది?

ఎవరి పేరునో పెట్టుకొని
మరెవరి మురికినో
నా మనసు గోడలకు పూసుకొని
నన్ను ఎంతగానో వేధించి హింసించి, యాతనకు గురిచేసిన నర్మగర్భ ప్రశ్నలకు సమాధానాలు
ఎవరినడిగి తెలుసుకోను?

పెదవులు కదులుతున్నప్పుడు లేదా
శూన్యంలాంటి ప్రదేశంలో
వెలుగులా నిల్చున్నప్పుడు
ఎక్కడి నుండో
ఒక వేదనా పూరితమైన వాక్యం విల్లులా దూసుకువచ్చినప్పుడు
కిరణాలు తెగిన సూర్యునిలా కూలిపోయిన దృశ్యాలే వేటాడుతుంటే
నేనెవరో చెప్పుకునే ధైర్యం నాకెక్కడిది?

నా జీవిత కాలంలో
నీ అంత దృఢమైన, దిక్కులు చీల్చుకుని వచ్చిన కంఠంతో
ఏ దూలానికి ఊగినానో చెప్పుకునేందుకు
అక్కడ మాటలను
సమాధి చేయడమే నాకు తెలుసు
అక్షరాలను ఉప్పెనలా చల్లడమే మార్గం

చీకట్లు చీకట్లు మనసు నిండా కాదు
పేరుకుపోయిన ఆలోచనల నిండా కమ్ముకున్న చీకట్లు
చూపుడు వేలుతో కంట్లో పొడుచుకోవడం కాదు
కూలిపోయిన సూర్యుడిని
కవిత్వ కిరణాలతో నిలబెట్టుకుంటాను

ష్‌
గప్‌ చుప్‌
బాత్‌ నహీ కామ్‌ కరో

అఖిలాశ
72595 11956