Aug 05,2021 15:54

విశాఖ : ఇటీవల తెలంగాణ నుంచి ఎపికి బదిలీపై వచ్చిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ ముఖంపై తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇసుక కొట్టింది. ఈ ఘటనతో డిప్యూటీ కమిషనర్‌ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌.. జిల్లాలోని దేవాదాయ శాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీని చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఈ భూముల వ్యవహారంలో తన కింది సిబ్బంది వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు వారిని హెచ్చరించారు. ఆయన చేతిలో మందలింపులకు గురైన వారిలో అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి కూడా ఉన్నారు. శాంతిని తన చాంబర్‌కు పిలిపించిన ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన శాంతి.. తాను తీసుకువచ్చిన ఇసుకను కోపంతో ఆయనపై చల్లారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్యాలయానికి విజిలెన్స్‌ అధికారులు చేరుకొని మొత్తం వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.

మానసిక వేధింపులు భరించలేకే..
ఈ ఘటనపై అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి వివరణ ఇస్తూ.. డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్ధన్‌ మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, అతని తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలను మనసులో ఉంచుకుని వేధించాడని, మానసిక వేదన భరించలేకే అతడిపై ఇసుక చల్లాల్సి వచ్చిందని తెలిపారు. అతడిపై ఇప్పటికే కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని, విచారణకు పిలిస్తే రాకుండా తన న్యాయవాదితో వస్తానని తప్పించుకున్నాడని ఆరోపించారు. అతడి తప్పేమీ లేకపోతే కమిషనర్‌ పిలిచినప్పుడు విచారణకు ఎందుకు రాలేదని శాంతి ప్రశ్నించారు.