Jul 30,2021 20:10
ఆకాశం నుంచి కింద పడిన రీసెర్చి పరికరం

ప్రజాశక్తి-యర్రావారిపాలెం (చిత్తూరు) : ఆకాశం నుంచి గొడుగులాంటి స్టీలురేకుపైన పెద్ద బెలూన్‌ అమర్చబడి ఉన్న ఓ పరికరం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లె పంచాయతీ ఆవులయ్యగారిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం పడింది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బెలూన్‌కు అమర్చబడి ఉన్న ల్యాబ్‌కు చెందిన రీసెర్చి పరికరం, కంప్యూటర్‌లో అమర్చే చిప్‌ పరికరాలను గుర్తించారు. వాతావరణంపై పరిశోధన చేయడానికి విద్యార్థులు ఈ పరికరానికి బెలూన్‌ అమర్చి ఆకాశంలో వదిలి ఉంటారని, బెలూన్‌ పగిలిపోవడంతో ఇది కిందపడిందని ఎస్‌ఐ వెంకట మోహన్‌ తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.