Nov 12,2023 13:44

అనగానగా ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. చిన్న కుటుంబం. సంతోషంగా జీవితం గడుస్తుంది.తల్లిదండ్రులు కొడుకులను చూసి మురిసిపోతూ ఉంటారు.
వారిద్దరిని బాగా చదివిస్తారు. ఏది అడిగినా లేదనకుండా ఇస్తారు. ఆ గారాబం వల్ల ఇంట్లో ఉన్నది, లేనిది తెలుసుకోకుండా ఆ పిల్లలు మారాం చేసేవాళ్లు. సంపాదించేది పిల్లల కోసం అనే ఉద్దేశంతో వారు ఏది అడిగితే అది కొనిచ్చేవారు. పిల్లలు పైచదువుల కోసం పట్నం వెళ్తారు. వారి చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ డబ్బులు పంపిస్తారు.
చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు వస్తాయి. వారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా పెళ్లి చేసుకుని, అక్కడే స్థిరపడిపోతారు.. ఊరికి తిరిగి రారు. తల్లిదండ్రులను పట్టించుకోరు. వాళ్ల చదువుల కోసం చేసిన అప్పులను తీర్చమని, అప్పుల వాళ్ళు గొడవ చేస్తారు.
ఎన్నిసార్లు చెప్పినా వారి కొడుకులు ఆ విషయాన్ని పట్టించుకోరు. ఆ వృద్ధ దంపతులను చూడడానికి రారు. 'మమ్మల్ని చదివించడం మీ బాధ్యత!' అని కోపంగా చెప్తారు. 'అప్పుల గురించి మాకు ఏం సంబంధం లేదు' అని కఠినంగా సమాధానం చెప్తారు.
చివరికి వృద్ధ దంపతులు వాళ్ళున్న ఇంటిని అమ్మి, అప్పులు తీరుస్తారు. మిగిలిన కొంచెం డబ్బుతో ఒక వృద్ధాశ్రమానికి చేరుకొని, అక్కడే కాలం గడుపుతారు.
అప్పుడు వాళ్ళు 'కనీసం ఒక కూతురు ఉన్నా మన గురించి ఒక కన్నీటి బొట్టు కార్చేది. మనల్ని చక్కగా చూసుకునేది కదా!' అని పశ్చాత్తాపం చెందుతారు. కొడుకులని మురిసిపోయినందుకు తగిన శాస్తి చేశారని బాధపడుతూ కాలం వెళ్లదీస్తారు.

pranavi

ఎ. ప్రణవి,
9వ తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం,
జనగామ జిల్లా.