- 5గురు అరెస్టు
ప్రజాశక్తి-కడప జిల్లా సిద్దవటం, రాజంపేట, తంబళ్లపల్లి ప్రాంతాల్లో జరిగిన మూడు సంఘటనల్లో 62ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, 5గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు రేంజి డీఐజీ ఎస్.సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీలు మురళీధర్, చెంచురాజు అధ్వర్యంలో మూడు బృందాలు శుక్రవారం నుంచి కూంబింగ్ చేపట్టాయి. రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద టీమ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనికతో కలిసి సిద్దవటం రేంజ్, ముత్తుకూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శనివారం ఉదయం 4గంటల సమయంలో దబ్బకోన ఫారెస్ట్ ఏరియా చేరుకునే సరికి కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టగా దుంగలను పడేసి చీకట్లో పారిపోయారు. అయితే 5గురిని పట్టుకోగలిగారు. పట్టుబడిన వారిని నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన చిల్పం సాంబయ్య (44), యడమకంటి రమణయ్య (53), కడప జిల్లా కుంటగిరికి చెందిన ముద్దా నరసింహులు (46), ఖాజీపేటకు చెందిన నక్కా వెంకటేష్ (62), బందేవేల్ టౌన్ కు చెందిన వనం చెన్నయ్య (70)లను అరెస్టు చేశారు. వీరి నుంచి 753కిలోల బరువు గల 26ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆర్ఐ కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ వినోద్ కుమార్ టీమ్ అన్నమయ్య జిల్లా పుల్లంపేట తుమ్మలబైలు సెక్షన్ నుంచి కూంబింగ్ చేపట్టారు. కరుకు ఏరు ప్రాంతం వద్ద కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని హెచ్చరించి చుట్టుముట్టే లోపు దుంగలను పడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో 8ఎర్రచందనం దుంగలు లభించాయి. మరో సంఘటనలో ఆర్ఐ చిరంజీవులుకు చెందిన ఆర్ఎస్ఐ పి.నరేష్ టీమ్ పోరుమామిళ్ల మండలం, తంబళ్లపల్లి సెక్షన్ నుంచి కూంబింగ్ చేపట్టారు. నాగలకుంట్ల పోస్టు, రామేశ్వరం గ్రామంలో రాచకొండ రామయ్య ఇల్లు గ్రామం చివర ఉండటంతో అనుమానం వచ్చి అక్కడుకు చేరుకున్నారు. టాస్క్ ఫోర్సు సిబ్బందిని చూసిన రామయ్య అక్కడ నుంచి పారిపోయాడు. అతను ఇదివరకు ఫారెస్ట్ వాచర్ గా పనిచేసినట్లు తెలుసుకున్నారు. ఇంట్లో సోదా చేయగా, 28ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 62ఎర్రచందనం దుంగల విలువ రూ.60లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ మూడు కేసులను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, సిఐ బాలకృష్ణ, ఎస్ఐ మోహన్ నాయక్ విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్లలో పాల్గొన్న బృందాలకు డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులు ప్రకటించారు.










