
కరోనా రెండో అలతో దేశంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరవలేని పరిస్థితి. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు ఒక విధమైన ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల రద్దుపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా నిర్ణయాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల రద్దు చేశారు. మరికొన్ని చోట్ల ఏది ఏమైనా జరపాలనే అంటున్నారు. అసలు విద్యార్థులు తెలివితేటల్ని తెలుసుకోవాలంటే పరీక్షా విధానమే సరైనదా? వాళ్లు విద్యావంతులు అయ్యారనడానికి ప్రాతిపదిక ఏమిటి? ర్యాంకులే చదువుకు కొలమానాలా? దీనిపైనే ఈ ప్రత్యేక కథనం...
కొన్నేళ్ళుగా మన దేశంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యావిధానంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పర్యవసానంగా పిల్లలు ఒత్తిడి చదువులతో సతమతమవుతున్నారు. కోవిడ్-19 గత ఏడాది వచ్చి సమసిపోతుందనుకున్న దశలో మరింత ఉధృతంగా రెండో అల వచ్చింది. అసలు ఈ ఏడాది ఎక్కువరోజులు పిల్లలు పాఠశాలలకు హాజరైందీ తక్కువనే చెప్పాలి. ఎక్కువశాతం ఆన్‌లైన్‌లోనే విద్య కొనసాగింది. అప్పుడూ ఇప్పుడూ సరిగ్గా పిల్లలకు పరీక్షలు జరిగే సమయంలోనే కరోనా ఉధృతి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో పరీక్షల రద్దు అంశం ముందుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా పిల్లలు, తల్లిదండ్రులు జీవితాలు నాశనమైపోయినట్లు బాధపడుతున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. కొందరు ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, అధికారులు, మంత్రులు పరీక్షల రద్దును వ్యతిరేకించడం. పరీక్షలు లేకుండా చేస్తే వాళ్ల భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
అనారోగ్యకరమైన పోటీతత్వం..

'మా అమ్మాయి రజితకు 98% మార్కులు వస్తున్నాయి. కానీ ఇంకొక్క శాతం తెచ్చుకోమంటున్నాం. రాత్రిపగళ్లూ చదువుతూనే ఉంటుంది. కానీ ఒక్క శాతం ఎలాగోలా స్కోర్ చేయాలనే రజితా మేమూ పట్టుదలగా కృషి చేస్తున్నాం.' గొప్పగా చెప్తోంది ఓ అమ్మ. 'ఆ సుబ్బారావు కొడుక్కి ఈసారి పది ర్యాంకులలోపే వస్తుందని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నువ్వు సీటు తెచ్చుకునే ర్యాంకు అయినా తెచ్చుకుంటావో లేదో నేను చెప్పలేని పరిస్థితి. నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా? నేను పడుతున్న టెన్షన్‌లో ఒక వంతైనా నువ్వు పడితే ఫలితమేమైనా మెరుగ్గా ఉంటుంది' ఓ తండ్రి కొడుకుపై వెళ్లగక్కుతోన్న ఆక్రోశం. 'ఒరేరు 98% కన్నా తక్కువ మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఎందుకూ పనికిరానివాడి కిందే లెక్క..!' ఓ తండ్రి కొడుకుపై ఆగ్రహంతో అంటున్న మాటలు. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నవే. ఇంతకీ ఈ పిల్లలంతా బాగా చదువుతున్న వాళ్లేనా? వీళ్ల తెలివితేటలన్నీ ఇలా పర్సెంటీజీలతో సరిపోల్చి మాట్లాడటం వల్ల జరిగే ఫలితాలు చాలావరకూ విరుద్ధంగా వస్తున్నాయనేది వాస్తవం. ఇలాంటి అనారోగ్యకరమైన పోటీతత్వంతో పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. మరికొందరు టార్గెట్‌ను రీచ్ కాలేకపోతున్నామన్న ఆందోళనతో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. కొందరు అసలు చదవడమే మానేస్తున్నారు. అందుకే ఇది సరైన విధానం కాదనేది నిపుణులు చెప్తున్న మాట.
ఇంజనీరింగ్ / మెడిసిన్ ఇవేనా ?
కొన్నేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యాపారం మొదలైంది. ప్రధానంగా రెండు సంస్థలే విద్యావిధానంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. అక్కడ చదువుకోవడం కాదు.. చదువుకొనడమే.. పదో తరగతి పాసవ్వడం మొదలు.. ఆ మార్కులను బట్టి ఆ పిల్లల్ని ఇంజనీరింగో, మెడిసినో చదివించాలనే ఆ తల్లిదండ్రుల తాపత్రయం. ఆ రెండింటిలో ఏదో ఒకటి చదివితేనే విద్య అనుకునే వాతావరణం ఏర్పడింది. ఈ వాతావరణాన్ని సృష్టించింది సదరు విద్యా వ్యాపార సంస్థలే.. ఫలితంగా ఉన్న కొద్ది సీట్లలో స్థానం సంపాదించేందుకు పిల్లల్ని కోళ్లఫారాల్లాంటి కార్పొరేట్ కాలేజీల్లో వేస్తున్నారు. అక్కడ రకరకాల కేటగిరీల కింద విభజించబడి ఆత్మన్యూనతా భావంతో పోటీపడలేక అనేకమంది పిల్లలు భవిష్యత్తు వికసించే దశలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఈ రెండింటిలో ఏదో ఒకటే చదవాలనే క్రమంలో కొన్నేళ్లుగా వేరే చదువులకు ప్రాధాన్యం తగ్గిపోవడం.. అందుకు సంబంధించిన నిపుణులు సమాజానికి అందకపోవడం ఒక ప్రధాన లోపం. ఫలితంగా ఆయా రంగాల్లో నిపుణుల కొరత ప్రధానంగా కొరవడటంతో సమాజం వెనుకబాటుకూ కారణమైంది. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన వాస్తవం.
పరీక్షా పద్ధతిలో లోపం..

ఏదేమైనా, పరీక్షలు మరియు మెరిటోక్రసీపై అధికంగా ఆధారపడిన విద్య యొక్క ప్రస్తుత నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాలి. మన విద్యార్థుల తెలివితేటలను పరీక్షించడానికి మనం ప్రత్యేకంగా పరీక్షలపై ఆధారపడాల్సిన అవసరం ఉందా? పరీక్షలు లేకపోతేనో, ఆలస్యంగా జరిగితేనో ఏడాదంతా చదువుకున్న విద్య పనిచేయదా? సామాజిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతికంగా అత్యంత వైవిధ్యమైన దేశాలలో ఒకటిగా ఉన్న మనదేశంలో పరీక్షా విధానం వివక్షతతో కూడుకుని ఉన్నది. శాశ్వత గ్రామీణ ప్రాంత విద్యకూ, పట్టణ ప్రాంత విద్యకూ తేడా కచ్చితంగా ఉంటుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పదో తరగతి పాసై పట్టణంలో కార్పొరేట్ కాలేజీలో చదివేటప్పుడు ఆ తేడా ప్రభావం చూపుతుంది. ఆ కాలేజీల్లో తరగతి విభజన, డిజిటల్ విభజన ఎప్పుడూ విద్య నేర్వడానికి విరుద్ధంగానే ఉంటాయి. అభివృద్ధి చెందని, బలహీనమైన బీహార్ / రాజస్థాన్ పట్టణంలో నివసిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఢిల్లీ లేదా మరే ఇతర మెట్రోపాలిటిన్ నగరానికి చెందిన ఉన్నత తరగతి ప్రైవేట్ పాఠశాల విద్యార్థినితో సమానంగా ఉంచలేరు. ఇంకా విద్యార్థులు ఇద్దరూ ఒకే పాఠ్యపుస్తకాలు చదువుతూ సిబిఎస్‌ఇ నిర్వహించిన ఒకే పరీక్షలో పాల్గొని, ఒకరితో ఒకరు పోటీ పడాలి. పర్యవసానంగా సమానావకాశాల భ్రమలో, వారి ప్రదర్శనలు నిస్సందేహంగా మారుతూ ఉంటాయి. పోటీ నిచ్చెనపై ఈ ఇద్దరు విద్యార్థుల అసమాన స్థానం పూర్తిగా ఏకరీతి, పక్షపాత పరీక్షల వ్యవస్థ వెనుక పూర్తిగా దాచబడుతుంది. ఎప్పుడో ఒకసారి ఆటో-రిక్షా డ్రైవర్ / టీ అమ్మే వ్యక్తి బిడ్డ 95% మార్కులు సాధించినట్లు వార్తాపత్రికలలో వస్తుంది. ఇక్కడ చూడాల్సింది విజేత మార్గాన్ని కనుగొనడమే. అయితే మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో కొందరు పరీక్షలను రద్దు చేయడాన్ని వ్యతిరేకించడం. పరీక్షల కన్నా అభ్యాస ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరగాలనే వాస్తవాన్ని విస్మరించడం. అది పిల్లలను జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోవడం. పరీక్షలు, పోటీ అనేవే జీవితాన్ని నిర్దేశించేవనే భ్రమల్లో ఉండిపోవడం. ఇవి విజయాన్ని ఆహ్వానించడానికి.. ఓటమిని అంగీకరించలేని ఒక స్వభావాన్ని పెంచుతాయనేది ఆందోళన కలిగించే అంశం.
అభ్యాసం ప్రధానం..

విద్య నేర్పడంలోనే మార్పు రావాలి. ''టాప్.. టాపర్'' అనే మాటలు విద్యార్థులను, తల్లిదండ్రులను ట్రాప్‌లో పడేసేవే. విద్యార్థికి పాఠం ఏమేరకు అర్థమైంది అనేది.. ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారనేది ముఖ్యం. ఆచరణాత్మక అభ్యాసం విద్యార్థిని పరిశోధనలవైపు మరులుస్తుంది. ఫలితంగా తెలివైన పౌరులుగా తయారవుతారు. అలాకాకుండా లోపభూయిష్టమైన మెరిటోక్రసీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులు ఆందోళనలకు లోనవుతారు. భయపడే లక్షణం అలవడుతుంది.. ఒకసారి ఓటమి చవిచూస్తే.. ఇక వేటినీ సాధించలేమనే అపనమ్మకం వీళ్లలో ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ మెరిట్ బేస్డ్ విధానంలో ఎక్కువ మంది విద్యార్థులు చదువులో ఆదర్శంగా లేరు. కానీ పరీక్షలు రాయడంలో మంచివారు. వీళ్లు పరీక్షల్లో బట్టీపట్టింది రాయగలుగుతారు. ఆ సబ్జెక్టును లోతుగా అవగాహన చేసుకోవడానికి తమ ఆలోచనను విస్తృతపరుచుకునేందుకు ఉపయోగించరు. ఫలితంగా వారి విజ్ఞానం ఒకమేరకే పరిమితమైపోతుంది.
అవగాహన లోపం..

అంతేకాక, పిల్లలు ఎలా నేర్చుకుంటారు? పిల్లల ఎదుగుదలను ఎలా అంచనా వేయాలి? అనే అవగాహన ఉపాధ్యాయులకూ లేదు. ఈ పోటీ వ్యవస్థలో అధిక గ్రేడ్‌లు మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. వాళ్లకీ యాజమాన్యాలు ఆవిధమైన టార్గెట్‌లు ఇవ్వడమే లోపం. కార్పొరేట్, కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు విద్యార్థులకు పాఠ్యాంశాలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నంతవరకు మాత్రమే సరైన విధానం అని భావిస్తున్నాయి. ఇక ఆ విద్యార్థులకు అన్వేషించడానికి, పరిశోధించడానికి, విచారించడానికి సమయం లేదు. ప్రస్తుతం 'పరీక్ష యోధులు' అని పిలవబడే ఈ వ్యవస్థ మానసిక రుగ్మతను పెంపొందిస్తుంది. అపనమ్మకాన్ని పెంచుతుంది. ఏకంగా విద్యార్థి వ్యక్తిత్వాన్నే అణచివేస్తుంది. ఇది మరింత కోల్పోయి, వాళ్లల్లో అసమగ్రత విభజించబడిన సామాజిక వ్యవస్థకు దారితీస్తుంది. సామరస్యం, సమ్మతి లేకపోవడం పెంపొందుతుంది. ప్రస్తుతం సమాజంలో వున్న మనం ఈ మెరిటోక్రసీ పరీక్షల వ్యవస్థను అంగీకరించి, అమలు చేస్తున్నాం. పిల్లల్ని గొప్ప ప్రతిభావంతుల్ని చేస్తున్నామనుకుంటూ ఓ వైఫల్య చక్రంలోకి పంపుతున్నాం.
ప్రభుత్వరంగంలోనే విద్య..
ఈ పరిణామాలన్నీ జరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వరంగంలో విద్య తగ్గిపోవడమే. విద్య ప్రయివేటీకరణ తర్వాతే ఈ విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా విద్యారంగాన్ని ప్రభుత్వపరం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. విద్య అందరికీ అందుబాటులోకి రావాలన్నా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఉండాలి. విద్యారంగంలో అసమానతలు తొలగడానికి అనారోగ్యకర పోటీతత్వం పోవాలన్నా కార్పొరేట్ విద్య స్థానే ప్రభుత్వ విద్య అవసరం. నిష్ణాతులైన అధ్యాపకులున్న ప్రభుత్వ పాఠశాలలను, కాలేజీలను మరింత పరిపుష్టం చేయాలి.
కరోనా ఒక్కసారి మన జీవనశైలిని పునఃపరిశీలించమని అవకాశం ఇచ్చింది. అందువల్ల, ప్రస్తుత విద్య, విద్యావిధానం గురించి మనమందరం బాగా ఆలోచిం చాలి. మన పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించేలా, సహృదయతతో వ్యవహరిం చేలా, శాస్త్రీయ అవగాహనతో ఎదిగేలా ఈ విద్యలో పొందుపరచేలా చేయాలి. అన్నింటికన్నా ర్యాంకులు వచ్చినవారిని కీర్తించడం, రాని వారిని దూషించడం మధ్య విద్యావిధానమే ప్రధాన కేంద్రం. ఈ మెరిటోక్రసీ మన పిల్లలకు శాపం అని తెలుసుకోవాలి. సరైన విద్యావిధానం అమలు జరిపితే మన పిల్లలు విజ్ఞానవం తులని మనమే కాదు సమాజం గ్రహించగలిగేలా వాళ్ల భవిష్యత్తే నిర్దేశిస్తుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో సరికాదు
చదువుల్లో ర్యాంకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన పద్ధతికాదు. స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభించే నాటికి ఆయా తరగతులను బట్టి మూల్యాంకనం చెయ్యాలి. దానికి మార్గదర్శకాలను రూపొందించాలి. సబ్జెక్టు, యూనిట్ ప్రకారం కాకుండా విద్యార్థులను పరీక్షించాలి. సహజమైన అభివృద్ధి, అభ్యాసనం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. దానినే మనం మూల్యాంకనం చెయ్యాలి.
ఎవరైనా విద్యార్థి ఒక విషయాన్ని నేను నేర్చుకుంటున్నాను లేదా నేర్చుకున్నానని ఇతరులకు ప్రదర్శిస్తుంటారో అప్పటివరకు ఆ విద్యార్థి ఏ విషయాన్నీ నేర్చుకోలేడు. నేర్చుకోవడం అంటే కేవలం కొంత సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అవసరమైనపుడు తిరిగి గుర్తు తెచ్చుకోవడమే కాదు. నేర్చుకోవడం అంటే వ్యక్తి సంబంధిత ప్రవర్తనలో ఒక శాశ్వత మార్పు సంభవించడం. దీని అర్థం మారిన ప్రవర్తన శాశ్వతంగా ఉంటుందని గానీ ఉండాలని గానీ కాదు. మారక ముందున్న ప్రవర్తన శాశ్వతంగా తుడిచి పెట్టుకుపోయిందని అర్థం. కొత్త విషయాలు నేర్చుకున్నపుడు తాజాగా ఏర్పడ్డ ప్రవర్తన కూడా మారిపోవచ్చు.
విద్యాలయాలు, గ్రంథాలయాల కేవలం సమాచారం లభించే కేంద్రాలే తప్ప అవి వ్యక్తికి నేర్పించే నిలయాలు కాదు. వ్యక్తి తన అహాన్ని వదిలి, కొత్త విషయాలను నేర్చుకోవాలని నిర్ణయించుకుంటే ఎక్కడైనా నేర్చుకోగలడు. అలా కాని పక్షంలో ఎవరూ నేర్పలేరు. ఇప్పటికీ మన విద్యావ్యవస్థ సంప్రదాయ పోకడలను వదులుకోలేకపోతుంది. మన విద్యావ్యవస్థ మొత్తం ఏదయినా విషయాన్ని అంగీకరించడం లేదా ఖండించడంతోనే కొనసాగుతుంది. దీని వలన వ్యక్తి ఆటిట్యూడ్ బలపడుతుంది తప్ప, మార్పు సంభవించదు. అందువల్లే మన విద్యావ్యవస్థ ఉద్యోగస్థులను, వ్యాపారస్థులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి తప్ప, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించలేకపోతున్నాయి. వ్యక్తి మనస్సు నిబంధనలలో సృజనాత్మకతను కోల్పోతుంది. కేవలం స్వేచ్ఛ లభించినపుడు మాత్రమే మనస్సులో కొత్తగా ఆలోచనలకు అవకాశం లభిస్తుంది. క్లాస్‌రూం కంటే ప్లేగ్రౌండ్‌లోనే జీవితం ఎక్కువగా అర్థమవుతుంది.

అసిస్టెంటెంట్ ప్రొఫెసర్, సైకాలజీ
విద్యావ్యవస్థే అలా ఉంది !
ప్రపంచంలో చాలా దేశాలలో పరీక్షలు, ర్యాంకులు కంటే విద్యార్థి కృత్యాలకు, నిరంతర మూల్యాంకనకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన విద్యావ్యవస్థలో మొదటి నుండి పరీక్షలకు, మార్కులకు ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవటంతో చర్చ జరుగుతున్నది. 10వ తరగతి, ఇంటర్ అనేక జాతీయ పరీక్షలకు ఆధారం కావటంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్ ప్రమాదకరంగా వుంది. కాబట్టి, పరీక్షల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వాటిని రద్దు చేయాలి. అదే సమయంలో విద్యార్థులు నష్టపోకుండా, వట్టి పాస్ సర్టిఫికేట్ కాకుండా, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వాలి. అల్టిమేట్‌గా విద్యార్థులు నష్టపోకుండా చూడాలి.

ఎంఎల్‌సి
మేధోశక్తిని దెబ్బతీస్తున్నాయి !
రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పరీక్షలను సైతం రాజకీయం చేయగల నైజం రాష్ట్రంలో కొన్ని రాజకీయ నాయకులకు ఒంటపట్టింది. కోవిడ్ 3వ అల హెచ్చరికలు వస్తున్న నేపథó్యంలో పిల్లలకు మరింత ప్రమాదం పొంచి ఉందన్న తరుణంలో ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థులు ప్రాణాలను ఫణంగా పెట్టడమే. ఆయినా విద్యార్థుల మార్కులే ప్రామాణికంగా చూడటం తప్పు. విద్యార్థి తరగతికి దూరమై రెండు నెలలు అవుతుంది. ఈ కాలంలో విద్యార్థులకు ఎటువంటి విద్యాబోధన అందించలేని ప్రభుత్వం.. వారిని పరీక్షలకు సిద్ధమవ్వమనడం మానసికంగా ఒత్తిడి చేయడమే. ఎస్‌ఎఫ్‌ఐ ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని, ఇంటర్ ద్వితీయ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తోంది. విద్యార్థికి ర్యాంకులే పరమావధిగా విద్యావ్యవస్థను ప్రభుత్వాల సహకారంతో కార్పొరేట్లు సృష్టించాయి. దీని ప్రభావంతో బట్టీపట్టే చదువులు రావడం విద్యార్థి మేధోశక్తిని దెబ్బతీస్తున్నాయి.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు
- శాంతిశ్రీ
98663 71283