Aug 11,2023 21:51

విద్యార్థులతో మాట్లాడుతున్న నారాయణమూర్తి

* సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి
ప్రజాశక్తి - టెక్కలి: 
విద్య ప్రైవేటీకరణ వల్ల సంస్థల మధ్య పోటీ పెరిగి, ర్యాంకుల కోసం పేపర్‌ లీకేజీ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని సినీనటుడు, దర్శక, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. దీనివల్ల యువత నష్టపోవడమే కాకుండా మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. టెక్కలిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రణవి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, శ్రీవిద్య జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో శుక్రవారం ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఇతివృత్తంగా 'యూనివర్సిటీ' సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. స్థానిక నటీనటులతో విద్యార్థులు, యువతకు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణతో వాటిల్లుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపామన్నారు. ఈ సినిమాను ఆదరించాలని కోరారు. అభ్యుదయవాదులు విద్యాసంస్థలను నెలకొల్పినా, కార్పొరేట్‌ సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యం కావల్సిన యువత వాటి ద్వారానే నిర్వీర్యమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.బి దేవి విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు, డైరెక్టర్‌ పేడాడ చంద్రశేఖర్‌ ఆజాద్‌, కార్యదర్శి పి.సూర్యనారాయణ, ఆర్‌.వెంకటరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.సతీష్‌కుమార్‌, ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.