Oct 14,2023 22:07

ర్యాలీలతో రచ్చకెక్కిన నగరి పాలి'ట్రిక్స్‌'
దాడి చేశారని ఒకరు.. అది నాటకమని మరొకరు
టిడిపి, వైసిపి నేతల బాహాబాహి
ప్రజాశక్తి-నగరి: ప్రశాంత నగరి నియోజకవర్గంలో రాజకీయక్రీడ ఆరంభమైనట్లే తెలుస్తోంది. రాజకీయం రచ్చకెక్కి ఘర్షణ వాతావరణం నెలకొల్పింది. ఇన్నాళ్లు అధికారిక కార్యక్రమాలతో బిజిబిజిగా గడిపారు మంత్రి ఆర్‌కే రోజా. పార్టీ కార్యక్రమాలతో కేడర్‌ను ఉత్తేజింప జేసే పనిలో పడ్డారు టిడిపి అభ్యర్థి భానుప్రకాష్‌. అంతా భాగానే ఉన్నా.. శుక్రవారం నగిరి పర్యటనలో ఉన్న టిడిపి నేత భానుప్రకాష్‌పై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులతో కలసి భానుప్రకాష్‌ ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నీ దొంగ నాటకలే భానువి అంటూ కేవీపీఆర్‌ పేట నుంచి ఓంశక్తి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రోజాకు జై కొడుతూ టిడిపి నగరి అభ్యర్థి భానుప్రకాష్‌పై నిప్పులు చెరిగి విమర్శనాస్రాలు విసిరారు. ఈ సందర్భంగా మంత్రి రోజా సోదరుడు రామ్‌ప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగనన్న సురక్ష నిర్వహణ కోసం ఆస్పత్రి వద్ద ఉన్న వైసిపి నాయకులను చూసి పారిపోతూ వాహనాన్ని వెనక్కు తిప్పుకొని లారీని ఢకొీని పరుగులు తీసిన భానుప్రకాష్‌ మందుమీదున్న నలుగురు పచ్చతమ్ముళ్లు పక్కన రావడంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ దిగజారుడు రాజకీయాలకు తెరతీశారన్నారు. గత చరిత్ర గురించి ఆయన మాట్లాడుతున్నారని రోజమ్మది ఆయనలా కన్న తండ్రి మరణానికి కారణమైన చరిత్ర కాదన్నారు. కన్న తల్లే ధ్వేషించుకునే చరిత్ర కాదన్నారు. మహిళలను అగౌరవంగా మాట్లాడే నీచ సంస్కృతి ఉన్న చరిత్ర కాదన్నారు. నీ భాగోతమంతా మాకు తెలుసని విమర్శించారు. సినిమాల్లోను, రాజకీయాల్లోను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని స్వశక్తితో, పట్టుదలతో కష్టపడి ఎదిగిన రోజమ్మది నిప్పులాంటి చరిత్ర అన్నారు. మరోమారు వ్యక్తిగత దూషణలు చేస్తే దాడి చేశారని ఆడుతున్న నాటకాన్ని నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌ హరి, నగరి, పుత్తూరు, నిండ్ర ఎంపీపీలు భార్గవి, మునివేలు, దీప, మొదలియార్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాలకష్ణ తదితరులు ఉన్నారు.
దాడి ఘటనలో 9మందిపై కేసు నమోదు
టిడిపి నాయకులు శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో వైసిపి నాయకుడుకి చెందిన వాహన షోరూంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంగా శని వారం సిఐ సురేష్‌ వివరాలను వెళ్లడించారు. షోరూం యజమాని శర వణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో టిడిపి నాయకులు ఈఎన్‌ శ్రీనివాసన్‌ (కేవీ పీఆర్‌ పేట), జె.శివకుమార్‌ (మాంగాడు), ధీనదయాళ్‌ (ముడిపల్లి), తులసిలింగం, ఎంఎం చంద్రశేఖర్‌, (ఏకాంబరకుప్పం) కన్నయ్య (ఏకాంబరకుప్పం దళితవాడ), టిఎం.మాణిక్యవాసన్‌, విపి హరి, కేఎం వడివేలు (పుదుపేట)పై కేసు నమోదు చేశామన్నారు. జరిగిన ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.