
ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : యాంటీ ర్యాగింగ్‌పై కాటూరి మెడికల్ కాలేజి, ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కాలేజీల్లో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాటూరి మెడికల్ కాలేజిలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో గుంటూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ర్యాగింగ్ చట్ట విరుద్ధమన్నారు. ఆర్‌విఆర్‌లో జరిగిన సదస్సులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ స్పందన మాట్లాడుతూ ర్యాగింగ్ పర్యవసానాల గురించి వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి కఠిన చర్యలు, శిక్షలు ఉంటాయని, అలాంటి శిక్షలు పడితే విద్యార్థులు భవిష్యత్ పాడవుతుందని వివరించారు. కార్యక్రమంలో కాటూరి మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ కాటూరి సుబ్బారావు, ఆర్‌విఆర్ ప్రిన్సిపాల్ కొల్లా శ్రీనివాసరావు, మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : ర్యాగింగ్ నివారణలో భాగంగా మండలంలోని డోకిపర్రు సమీపంలో ఉన్న యూనివర్సల్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గుంటూరు జూనియర్ సివిల్ జడ్జి పొన్నూరు బుజ్జి మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడితే పడే శిక్షలను వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చదవుపై దృష్టిని కేంద్రీకరించి స్నేహపూరిత వాతావరణంలో వికాసం పొందాలని సూచించారు. అత్యవసర సయాల్లో దిశ యాప్‌ను ఉపయోగించుకుని రక్షణ పొందాలన్నారు. కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కేశవరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్‌ను నియంత్రించడంలో కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ పనితీరును ప్రశంసించారు. కార్యక్రమంలో అడ్వకేట్ కె.శ్రీరామ్, యాంటీ ర్యాగింగ్ కో-ఆర్డినేటర్ జి.మర్రెడ్డి, ఎం.రత్నం, అధ్యాపకులు పాల్గొన్నారు.