Sep 11,2023 00:04

రవణిని అభినందిస్తున్న అనంత్‌కుమార్‌

ప్రజాశక్తి-హుకుంపేట: అంధుల అంతర్జాతీయ క్రికెటర్‌ వలసనైని రవణిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుని, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ కొర్రా అనంత కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని మెరకచింత పంచాయతీ రంగసింగ పాడు గ్రామంలో ఆదివారం ఆమె స్వగ్రామంలో సన్మానించి అబినందనలు తెలిపారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్‌ కొర్రా అనంత కుమార్‌ మాట్లాడుతూ, అంధుల అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన అదివాసీ ముద్దు బిడ్డ వలసనైని రవణి దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చిందన్నారు. కలెక్టర్‌, ఐటీడీఏ పీవో చొరవ తీసుకొని రవణికి సహాయ సహకారాలు అందించాలన్నారు.సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ తరఫున ఉన్నతాధికారులతో మాట్లాడి క్రీడా రంగంలో ప్రోత్సహించాలని ఆయన కోరారు. క్రీడారంగంలో అనేక మంది గిరిజన యువతీ యువకులు జిల్లా, రాష్ట్ర స్థాయి గోల్డ్‌ మెడల్స్‌ సాధించినప్పటికీ గిరిజన యువతీ యువకులకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గిరిజన క్రీడాకారులను గుర్తించి ఆదుకోవాలని ఆయన కోరారు.