ప్రజాశక్తి-పాడేరు: ఇటీవల లండన్ లో జరిగిన అందుల క్రికెట్లో ఆల్ రౌండ్ ప్రతిభ కనపరిచిన పాడేరు ఏజెన్సీ హుకుంపేట మండలం రంగసింగి పాడు గ్రామానికి చెందిన రవణికి శనివారం మధ్యాహ్నం పాడేరులో ఘన స్వాగతం లభించింది. ఇటీవల క్రికెట్ పోటీలు ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన రవణి తన స్వగ్రామమైన రంగసింగిపాడుకు శనివారం వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు హుకుంపేట మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, కుటుంబీకులు, సన్నిహితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పాడేరులోని చెక్ పోస్ట్ నుంచి ప్రత్యేక వాహనంపై ఆమెను ఊరేగిస్తూ బైక్ ర్యాలీగా ఆమెను స్వగ్రామానికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలుపుతూ హర్షం ప్రకటించారు.. భారత జాతీయ జెండాలను పట్టుకొని బైక్‌లపై క్రీడాకారులు, యువకులు తోపాటు రవణి బంధువులు పలువురు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీ నిర్వహించారు.
పలువురు సన్మానం
అరకులోయ:అంధుల ప్రపంచ క్రికెట్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆదివాసీ ముద్దు బిడ్డ వలసనైని రవణికి హుకుంపేటలో అరకులోయ మండల విద్యాశాఖ అధికారి వి.త్రినాధ రావు సన్మానించారు. పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఇటీవల ఇంగ్లండ్ లో జరిగిన అంధుల క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ కప్ గర్వకారణం అన్నారు.అరకులోయ నియోజకవర్గ వైఎస్‌ఆర్సిపి నాయకులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అరకు వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు మాజీ సర్పంచ్ పాంగి చిన్నరావు, మాజీ జెడ్పీటీసీ కొర్రా కాసులమ్మ, మాజీ ఎంపిటిసి సమర్డి భాస్కరరావు, అరకులోయ, మాజీ సర్పంచులు గుడివాడ ప్రకాశరావు, పొట్టంగి రాంప్రసాద్, గొల్లోరి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ పల్టాసింగి విజరు కుమార్, స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ వంతాల అరుణ్ కుమార్ తో పాటు, వైఎస్సార్సీపీ నాయకులు పట్టాసి కొండలరావు, వంతాల గురునాయుడు, వెంకట్, సుక్రయ్య, రాజారావు తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట:క్రికెటర్ వలసనైని రవణి మండలానికి రావడంతో మండల కేంద్రం నుంచి రంగసింగ పాడు వరకు బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలు గిరిజన సంప్రదాయం ప్రకారం హారతిచ్చి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శతక బుల్లి బాబు మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగటం ఎంతో గర్వ కారణం ఆయన కొనియాడారు. రవణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులు క్రీడారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రమణకి న్యాయం జరిగేటట్లు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీటీసీ దీసారి గంగరాజు మాట్లాడుతూ, రవణి ఎన్నో ఆవాంతరాలను దాటుకొని ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ ఆంధుల క్రికెట్‌లో రాణించిందని కొనియాడారు. రవిణిని ప్రధాని నరేంద్ర మోడీ కనీసం గుర్తించక పోవడం బాధాకరమన్నారు. ఎంతో మంది క్రీడాకారులను ప్రభుత్వాలు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాయని తెలిపారు. ప్రపంచ స్ధాయిలో రాణించిన రవణిని ఆ స్ధాయిలో గుర్తించక పోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి సుడిపల్లి కొండలరావు, సిపిఎం మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణరావు, గిరిజన సంఘం కార్యదర్శి తాపుల.కృష్ణారావు, జిసిసి ఎండి రామూర్తి, సర్పంచ్ దూసూరు పద్మ కుమారి, ఎంపీటీసీ నైని రజిని, నాయకులు వెంకట్రావు, సత్తిబాబు, హుకుంపేట సర్పంచ్ సమిడ.వెంకటపూర్ణిమ్మ, కొట్నపల్లి ఎంపిటిసి సాంబే బాలకృష్ణ, ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










