Nov 01,2022 21:05

ప్రజాశక్తి - ఉంగుటూరు
          ప్రభుత్వాలు ఉపాధి చూపకపోయినా స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్న రవాణా కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక జరిమానాలు, చలానాలతో వేధించడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి కొక్కిరపాటి వెంకట్రావు విమర్శించారు. అంబేద్కర్‌ ట్రాలీ ఓనర్స్‌, డ్రైవర్స్‌ యూనియన్‌ విస్తృత సమావేశం మంగళవారం స్థానిక యూనియన్‌ కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు టేకి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రవాణారంగం నుంచి కార్మికులను దూరం చేసి కార్పొరేట్‌పరం చేయడానికి కేంద్రప్రభుత్వం మోటార్‌వాహనాల చట్టాన్ని సవరించిందన్నారు. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మానవతప్పిదాల వల్లే రోడ్లపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయనడం సరైంది కాదన్నారు. 70 శాతం ప్రమాదాలు ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరుగుతున్నాయని పలు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 15 శాతం కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఈ రంగంపై కార్పొరేట్ల కన్ను పడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ బిల్లు రాజ్యసభలో వీగిపోవడంతో రాష్ట్రాలను అమలు చేయాలని సూచించడంతో రాష్ట్రప్రభుత్వం జిఒ 27తో కార్మికులను నిలువునా దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. డ్రైవర్ల మెడకు ఉరిగా మారబోతున్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని వెంకట్రావు కోరారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిఒ 27ను రద్దు చేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిహెచ్‌.గోపీచంద్‌, ఎ.కాశీవిశ్వనాధం, కె.వెంకటరాజు, రౌతు పురుషోత్తం, పి.రాజు, ఎస్‌.రాంబాబు, దారం వెంకట్రావు, షేక్‌ శ్రీను పాల్గొన్నారు.