Oct 05,2023 00:40

ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.శివాజి

ప్రజాశక్తి - మంగళగిరి : రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైన జీవో 21 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భారీగా పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.శివాజి డిమాండ్‌ చేశారు. ఈ అంశాలపై ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే చలో విజయవాడకు రవాణా కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికుల సమావేశం స్థానిక టాటా మ్యాజిక్‌ ఆటో స్టాండ్‌ వద్ద కె.కొండలు అధ్యక్షతన బుధవారం జరిగింది. శివాజీ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు ఇన్సూరెన్స్‌ ధరలనూ పెంచిందని, రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా భావించి తీవ్రమైన భారాలు మోపుతోందని విమర్శించారు. ఈ పదేళ్లలో ఇంధన ధరలు రెట్టింపయ్యాయన్నారు. కార్మికులకు ప్రమాదకరమైన మోటార్‌ వాహన చట్ట సవరణ చేయగా దాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుక వైసిపి ప్రభుత్వం జీవో 21ను జారీ చేసిందన్నారు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా తీవ్రమైన శిక్షలు విధించడం, 304ఎ వంటి ప్రమాదకరమైన సెక్షన్లు కట్టడం, జైలుకు పంపించడం వంటి చర్యలకు పూనుకున్నారని ఆందోళన వెలిబుచ్చారు. రోడ్‌ టాక్స్‌, గ్రీన్‌ టాక్స్‌ పేరుతో పెద్దఎత్తున పన్నులు వసూలు చేస్తున్నా రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్లు కూడా సరిగ్గా వేయలేదని, దీని వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు, వాహనాలు తీవ్ర స్థాయిలో మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పారు. మరోపక్క ఫీజులు, పెనాల్టీలు పెంచడంతోపాటు, స్పేర్‌ పార్ట్‌ ధరలు పెంచారన్నారు. ఇ-చలానాలు, కేసులు రాస్తూ వాహనాలు రోడ్లపై నడపలేని దుస్థితికి తెచ్చారన్నారు. ప్రభుత్వం ఒకపక్క ఉద్యోగాలు కల్పించకుండా మరోపక్క స్వయం ఉపాధి పొందుతూ, ప్రైవేటు ఫైనాన్స్‌ దగ్గర అప్పులు తీసుకొని కుటుంబం పోషణ చేసుకుంటున్న రవాణా రంగ కార్మికులపై భారాలు మోపడం దారుణమన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే పోరాటంలో కార్మికులంతా కలిసి రావాలని, విజయవాడ అలంకార్‌ సెంటర్లో శుక్రవారం జరిగే మహాధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్‌ ఖాసిం, షేక్‌ బాషా, హనుమంతరావు, యు.సాంబయ్య, నవీన్‌, ఎ.వెంకటేశ్వ రరావు, సిహెచ్‌ రామకృష్ణ పాల్గొన్నారు.