ధాన్యం కిరాయి సొమ్ము కోసం లారీ, ట్రాక్టర్ యజమానుల ఎదురుచూపు
ఒక్క ఏలూరు జిల్లాలోనే రూ.పది కోట్ల వరకూ బకాయి
21 రోజుల్లో చెల్లింపు నిబంధనకు పూర్తిగా తూట్లు
లబోదిబోమంటున్న వాహన యజమానులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ధాన్యం నూతన కొనుగోలు విధానంలో అటు రైతులతోపాటు ఇటు ధాన్యం రవాణా చేసిన లారీ, ట్రాక్టర్ యజమానులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తరలించిన వాహన యజమానులు రవాణా ఛార్జీల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం తరలించిన 21 రోజుల్లో ధాన్యం రవాణా సొమ్ము జమ చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ రైతుభరోసా కేంద్రాల ద్వారా 3.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. నూతన కొనుగోలు విధానంలో ధాన్యం తరలింపు రవాణా ఛార్జీలను ప్రభుత్వమే వాహనదారులకు చెల్లించాలి. రైతులే సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకుంటే రైతుల ఖాతాల్లో రవాణా ఛార్జీలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. రవాణా ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వం పక్కాగా నిబంధనలు సైతం విధించింది. ఎనిమిది కిలోమీటర్లలోపు దూరానికి రవాణా ఛార్జీ కింద రూ.324, ఎనిమిది నుంచి 20 కిలోమీటర్ల దూరం రవాణా చేస్తే కిలోమీటర్‌కు టన్నుకు రూ.ఏడు, 20 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటే కిలోమీటర్‌కు టన్నుకు రూ.6.50, 40 నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటే కిలోమీటర్‌కు టన్నుకు రూ.ఆరు, 80 కిలోమీటర్లపైన దూరం ఉంటే కిలోమీటర్‌కు టన్నుకు రూ.5.50 చొప్పున ప్రభుత్వం రవాణా ఛార్జీలు నిర్ణయించింది. ధాన్యం రవాణాకు లారీలతోపాటు ట్రాక్టర్లను అధికారులు ఉపయోగించారు. ధాన్యం తరలించిన తర్వాత రైతుభరోసా కేంద్రంలో మిల్లులో జనరేట్ చేసిన ధాన్యం రవాణాపత్రం, సొసైటీ స్టాంప్, ఆర్‌బికె స్టాంప్, ట్రక్ డ్రైవర్ సంతకం, ట్రక్ కాపీ, లేదా ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ పత్రం వంటివి జత చేసి సివిల్‌సప్లయీస్ జిల్లా మేనేజర్ కార్యాలయంలో వాహన యజమానులు దరఖాస్తు చేసుకోవాలి. ధాన్యం తరలించిన 21 రోజుల్లో రవాణా ఛార్జీలు కిరాయి వాహనాలైతే యజమానుల ఖాతాల్లో, సొంతంగా రైతులే వాహనాలు పెట్టుకుని తరలిస్తే రైతుల ఖాతాల్లో రవాణా ఛార్జీలు జమ చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు మొదలై నెలా పదిహేను రోజులు దాటిపోయింది. ఇప్పటి రవాణా ఛార్జీలు జమ కాలేదని లారీ, ట్రాక్టర్ల యజమానులు లబోదిబోమంటున్నారు.
రూ.పది కోట్లకుపైగా రవాణా ఛార్జీలు బకాయి
ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకూ తరలించిన ధాన్యానికి రవాణా ఛార్జీల నిమిత్తం రూ.పది కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ రూ.కోటిన్నర వరకూ మాత్రమే జమైనట్లు తెలుస్తోంది. అదీ రైతులు సొంతంగా తరలించుకున్న వారికే జమైనట్లు సమాచారం. వాహనాదారులకు మాత్రం ఇంకా జమ కాలేదని తెలుస్తోంది. రవాణా ఛార్జీలు త్వరితగతిన జమ చేయాలని వాహనాల యజమానులు కోరుతున్నారు.
రబీ ధాన్యం తరలింపుపై ప్రభావం
మిల్లులకు ధాన్యం తరలించిన వాహనాలకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు సకాలంలో జమ చేయకపోవడం వల్ల రబీ ధాన్యం కొనుగోలులో తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి కన్పిస్తోంది. రవాణా ఛార్జీలు ఆలస్యమైతే రబీలో లారీ, ట్రాక్టర్ యజమానులు ధాన్యం తరలింపునకు తమ వాహనాలు పెట్టేందుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడనుంది. అదే జరిగితే రబీ ధాన్యం రవాణాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితి రానుంది. ఖరీఫ్‌లో ధాన్యం రవాణాలో లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రబీలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే రైతుల ఇబ్బందులు మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంది. వెంటనే లారీ, ట్రాక్టర్ యజమానులకు ఇవ్వాల్సిన ధాన్యం కిరాయి సొమ్మును ప్రభుత్వం వెంటనే జమ చేయాలని వాహనదారులు కోరుతున్నారు.










