రాయలసీమలో అతి పెద్దదిగా పేరొందిన తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పదకొండు మంది కోవిడ్ రోగులు ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించివేసింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల నుంచి పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రుయా ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో ఆసుపత్రి కిటకిటలాడుతున్నది. 1100 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 400 మాత్రమే. ఆక్సిజన్ అత్యవసరమనుకున్న వారికే ఈ బెడ్లు కేటాయిస్తారు. వీరికి ఆక్సిజన్ సరఫరా ఒక్క క్షణం ఆగినా పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అయిదు నిమిషాల సేపు ఆక్సిజన్ అందకపోయేసరికి 11 మంది ఊపిరి ఆగిపోయింది. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంలో జాప్యమే ఈ ఘోరకలికి కారణమని చెప్తున్నారు. ట్యాంకర్ మరో పది నిమిషాలు ఆలస్యమైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. రుయాలో చోటుచేసుకున్న మరణాలు నివారించదగ్గవే. అక్సిజన్ అందకపోవడం వల్లే వారు చనిపోయారు. ఇవి ముమ్మాటికీ నిర్వహణా వైఫల్యం ఫలితమే. ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన దృష్టాంతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఒక్క మనదేశంలోనే ఈ దుస్థితి ఎందుకొచ్చింది? కేంద్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్నది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోవడానికి నిరాకరించే ప్రభుత్వ నిర్వాకాన్ని ఏమనాలి? మొదటి దశలో ఆక్సిజన్ కొరత ఎదుర్కొన్న అనుభవం కళ్లముందున్నా దాని నుంచి ఎలాంటి పాఠాలు తీసుకోలేదు. ఏప్రిల్ 24న దేశ రాజధాని ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్‌లో ఆక్సిజన్ అందక 24 మంది చనిపోయిన తరువాత అయినా దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి, సప్లై పెంచేందుకు చర్యలు చేపట్టిందా అంటే అదీ లేదు. హైకోర్టులు, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా మోడీ ప్రభుత్వంలో చలనం లేదు. ఆక్సిజన్ అందించడానికి నిరాకరించడమంటే పౌరుల జీవించే హక్కును కాలరాయడమేనని సుప్రీం కోర్టు గట్టిగా హెచ్చరించినా తీరు మారలేదు. నిరుపయోగంగా పడి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు చేసిన సూచనలను సైతం అది పెడచెవిన పెట్టింది. ఆక్సిజన్ దగ్గర నుంచి వ్యాక్సిన్, మందుల కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం ద్రోహం చేస్తుంటే ఇది అన్యాయమని మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధైర్యం చేసి మోడీని ప్రశ్నిస్తే, తోటి ముఖ్యమంత్రిగా ఆయనకు మద్దతు పలకాల్సింది పోయి మోడీనిని వెనకేసుకురావడం దారుణం. ఆక్సిజన్ అందక మొన్న అనంతపురంలో అంతకుముందు కర్నూలు, విజయనగరం జిల్లాల్లో పదుల సంఖ్యలో రోగులు చనిపోయినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం వేగిరపడి ఉండాల్సింది. కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ఇరుగు పొరుగు రాష్ట్రాలను ఆదుకునే ప్రయత్నం చేయగలుగుతోంది. ఆ ముందుచూపు, ముందస్తు సన్నాహమే ఇక్కడి ప్రభుత్వానికి కొరవడింది. ఘటన జరిగిన తరువాత కొద్ది రోజులు హడావుడి చేయడం , ఆ తరువాత మరచిపోవడం రివాజుగా మారింది. అందుకే గత నాలుగు వారాల్లో ఒకే రకమైన ఘటనలు పదే పదే చోటు చేసుకున్నాయి. రుయా ఘటన నుంచి పాఠాలు తీసుకుని ఆక్సిజన్ సమస్య పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థలను భాగస్వాములను చేయడం ద్వారా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ అందక చనిపోయే దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూసే పూచీ రాష్ట్రప్రభుత్వానిదే.










