Sep 20,2023 22:28

రుయా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:సిఐటియు

రుయా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:సిఐటియు
ప్రజాశక్తి - తిరుపతి సిటి
రుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారామెడికల్‌, నాల్గవ తరగతి ఉద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉదయం రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిప్రభుకు సిఐటియు అధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ రుయాలో పని చేస్తున్న ఉద్యోగుల సీనియారిటీ లిస్టు ప్రకటించాలని, నాలుగవ తరగతి ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు, కన్వర్షన్‌ లు ఇవ్వాలని, వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లు, ఎమర్జెన్సీ వార్డుల అవసరాలకు అనుగుణంగా స్ట్రెచర్‌ బేరర్స్‌ ను నియమించాలని కోరారు. ఆప్కాస్‌లో పనిచేస్తున్న ఎంఎన్‌ఓలు, ఓటి అసిస్టెంట్లుగా డిప్యుటేషన్‌ లో ఉన్న ఉద్యోగులను, వారిని తీసుకున్న పోస్టులలో కొనసాగించాలని డిప్యూటేషన్లు రద్దు చేయాలని కోరారు. అన్ని వార్డులకు ఇండెంట్‌ తీసుకురావడానికి ఉద్యోగులను కేటాయించడం, ప్లంబర్‌ పోస్టులను భర్తీ చేయటం, ఫిమేల్‌ సర్జరీ వార్డులకు ఫిమేల్‌ బార్బర్‌ లను నియమించాలని కోరారు. మేల్‌ సర్జరీ వార్డులకు మేల్‌ బార్బర్‌ నే నియమించాలని, పెండింగ్‌ లో ఉన్న ఇంక్రిమెంట్లు, పిఆర్సీని తక్షణం అమలు పరచాలని, నాలుగవ తరగతి ఉద్యోగులకు, ఆప్కాస్‌ ఉద్యోగులకు క్యాజువల్‌ లీవులు, డే ఆఫ్‌ లు, హెల్త్‌ సూపర్వైజర్‌ ద్వారానే మంజూరు చేయాలని, రెగ్యులర్‌ ఉద్యోగులకు, ఆప్కాస్‌ ఉద్యోగులకు యూనిఫామ్‌, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, అన్ని క్యాడర్‌ లలోని ఉద్యోగులకు ప్రోత్సాహక ఆరోగ్య శ్రీ రుసుమును ఇవ్వాలని, ప్రతి నెలా పేస్లిప్పులు ఇవ్వాలని వినతిపత్రం లో కోరారు. తన పరిధిలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని రుయా సూపరింటెండెంట్‌ నేతలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్‌, రుయా హాస్పిటల్‌ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎన్‌. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి బి. గురవయ్య, ప్రధాన కార్యదర్శి ఏ. నరసింహులు, ముని చంద్ర, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.