Nov 14,2022 22:55

రేషన్‌ బియ్యం పక్కదారి
వినియోగదారులకంటే ముందుగానే మాఫియా చేతుల్లోకి
అధికారుల తీరుపైనా అనుమానాలు
కాకినాడకు తరలింపు..!
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

              ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రేషన్‌బియ్యం పక్కదారి పడుతోంది. పగలూ, రాత్రి తేడా లేకుండా బహిరంగంగానే జిల్లా సరిహద్దులు దాటి కాకినాడలోకి ప్రవేశిస్తోంది. అక్కడ నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుంది. అధికమొత్తం కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండగా మిగిలిన మొత్తం భూమి గుండ్రంగా ఉన్నట్లు తిరిగి మిల్లర్ల వద్దకే చేరుతోంది. దానికే పాలిష్‌పెట్టి సన్న బియ్యం పేరుతో కొందరు మిల్లర్లు మాయాజాలం చేస్తుండగా మరికొందరు లెవీపేరుతో ప్రభుత్వానికే తిరిగి అంటకడుతుండడం గమనార్హం.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరుతోపాటు పెదపాడు, దెందులూరు, పెదవేగి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, జీలుగుమిల్లి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఆచంట, నరసాపురం వంటి ప్రాంతాల్లో రేషన్‌ మాఫియా రాజ్యమేలుతోంది. ఈ ప్రాంతాల్లోని రేషన్‌ మాఫియా స్థానికంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చిరువ్యాపారులను, కొందరు యువకులను తమకు ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారిద్వారా రేషన్‌ బియ్యం కొనుగోలును గ్రామాల్లో, వీధుల్లో చేయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని చిన్నపాటి మూటలతో ద్విచక్రవాహనాల ద్వారా తమ గోదాములకు తరలిస్తున్నారు. దీనికిగానూ కిలో బియ్యాన్ని ఏజెంట్లు రూ.10 నుంచి రూ.12కు వినియోగదారుల నుంచి కొనుగోలు చేస్తుండగా వీరి వద్ద నుంచి పెద్ద వ్యాపారులు కిలో రూ.15 నుంచి రూ.17కు కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేసి లారీల ద్వారా కాకినాడ సమీపంలో ఉన్న మండపేట పరిసర ప్రాంతాల్లోని కొందరు మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. వారు అక్కడ వాటిని నిల్వ చేసి పాలిష్‌ పెట్టడంతో పాటుగా బాయిల్డ్‌ చేస్తున్నారు. అనంతరం వాటికి బిల్లులను సృష్టించి కాకినాడలోని పోర్టు మార్గంద్వారా ఇతర దేశాలకు కిలో రూ.26 నుంచి రూ.36కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతిరోజూ జిల్లా నుంచి సుమారు పదుల సంఖ్యలో లారీలు ఈ మిల్లర్లకు చేరుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టన్నట్లు వ్యవహరించడం కొసమెరుపు.
ఇ పోస్‌ల్లో తేడాలు..
ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో వినియోగదారునికి చేరకముందే రేషన్‌బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తుంది. ప్రతినెలా ఈ విధంగా రేషన్‌ డిపోలకు నెలాఖరునాటికి రేషన్‌బియ్యం చేరుకోగానే అదేరోజు రాత్రి మాఫియా ప్రత్యేక వాహనాల్లో అందులో కొంతభాగం బియ్యాన్ని తరలించుకుపోతుంది. మిగిలిన బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్లు ఆ తర్వాత వచ్చిన వారికి బియ్యం లేవని చెబుతుండడం గమనార్హం. దీంతో వినియోగదారులు ఏం చేయాలో తెలియక మరో డిపో వద్దకు రేషన్‌ పంపిణీ వాహనం వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. రేషన్‌పంపిణీ వాహనదారులు కూడా దీనిలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు. వారుకూడా ఎక్కడ వాహనం పెడుతున్నారో? ఏ రోజు ఏ సమయానికి పెడుతున్నారో కూడా సరైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. దీంతో వినియోగదారులు చాలామంది రేషన్‌బియ్యం తెచ్చుకోవడం మానేస్తున్నారు. మరికొందరు వేలిముద్రలు వేసి డీలర్ల వద్దనే నగదు తీసుకుని వెళ్లిపోతున్నారు.
మిల్లర్ల ద్వారా తిరిగి లెవీగా సేకరణ..!
కొందరు మిల్లర్లు చిరువ్యాపారుల ద్వారా రేషన్‌బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో వచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసి దానిస్థానంలో లెవీగా ప్రభుత్వానికి నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో తిరిగి ప్రభుత్వం ద్వారా అవే బియ్యం వినియోగదారులకు వస్తున్నాయి. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆడించి అధికధరలకు బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రేషన్‌బియ్యం మాఫియా వ్యవహారం కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకూ అందరికీ తెలిసినా ఎవరికి వారు తమకెందుకులే అనేరీతిలో వ్యవహరిస్తున్నారు. రేషన్‌ మాఫియా భారీస్థాయిలో ముడుపులు ముట్టజెబుతుండడంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. అంతేకాకుండా అడపాదడపా వాహనాలను పట్టుకుని కేసులు పెడుతున్నా నామమాత్రపు కేసులే పెడుతుండడంతో వారు తిరిగి ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పీడీ యాక్టు పెట్టే అవకాశాలున్నా అధికారులు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.