- జీడి ధరపై మంత్రి అప్పలరాజు ప్రతిపాదన
- ఆ రేటుకూ కొనలేం : వ్యాపారులు
- ఎవరికీ నష్టం లేకుండా ధర నిర్ణయిస్తాం : కలెక్టర్
- మద్దతు ధర ఇవ్వాలి : జీడి రైతు సంఘం
ప్రజాశక్తి - పలాస: జీడి మద్దతు ధరకు జీడిరైతు సంఘం ఆధ్వర్యాన జీడి రైతుల పోరాటం నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ స్పందించారు. పలాస తహశీల్దార్ కార్యాలయంలో జీడి వ్యాపారులు, జీడి రైతు సంఘం నాయకులతో వారు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ 80 కేజీల జీడిపిక్కల బస్తాను రూ.తొమ్మిది వేలకు కొనుగోలు చేయాలని ప్రతిపాదన చేశారు. ఉద్దాన ప్రాంతంలోని జీడి విస్తీర్ణాన్ని ఈ-క్రాప్ చేసి రైతుభరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను సేకరించి, ప్రతి జీడి పరిశ్రమకు 200 బస్తాల వరకు అప్పగిస్తామని చెప్పారు. దీనిపై పలాస జీడి పరిశ్రమ సంఘం అధ్యక్షులు మల్లా సురేష్ కుమార్, కోశాధికారి రవికాంత్, పారిశ్రామికవాడ జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షులు మల్లా రామేశ్వరరావు, తూముల శ్రీనివాసరావు స్పందిస్తూ ఇటువంటి ప్రతిపాదన వల్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కొంతమంది రైతులు వ్యాపారులతో సమన్వయం చేసుకొని ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారని, మరికొంతమంది దళారులతో చేస్తున్నారని చెప్పారు. జీడిపప్పు ధరలు తగ్గిపోవడం వల్లే పరిశ్రమలు బంద్ చేశామన్నారు. ఉద్దాన ప్రాంతంలో పండే జీడి పిక్కలు పది శాతమేనని, ఏడాది పొడవునా పప్పు ఉత్పత్తి చేయాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్, రైతులు దాసరి శ్రీరాములు, కుత్తం వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో పండే జీడిపిక్కలకు మాత్రమే పలాస బ్రాండ్ ఉందని తెలిపారు. అలాంటప్పుడు విదేశాల పిక్కలకు పలాస బ్రాండ్ పేరుతో ఎలా అమ్మకాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. పిక్కల ధర తగ్గుతున్నప్పుడు పప్పు ధర ఎలా పెరుగుతుందని, ఈ విషయాన్ని మంత్రి, అధికారులు అర్థం చేసుకోవాలని కోరారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ఇవ్వాలని, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. గతంలో జీడి రైతులకు ప్రభుత్వం ద్వారా బస్తాకు రూ.వెయ్యి చెల్లిస్తామని మంత్రి చెప్పినా, ఇంతవరకు ఎందుకు చెల్లించలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అప్పలరాజు స్పందిస్తూ మూడేళ్లుగా జీడి రైతులకు న్యాయం చేయాలని ఎంతో తపన పడుతున్నానని చెప్పారు. అయితే పలు కారణాలతో బస్తాకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వలేకపోయామన్నారు. జీడి పంటలకు రైతుభరోసా ఇస్తున్నామని, జీడి తోటల్లో అంతర పంటగా వేసుకునేందుకు దానిమ్మ మొక్కలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతర పంటలు వేయకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రైతుభరోసా కేంద్రం ద్వారా జీడిపిక్కలను తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని తెలిపారు.
ఎవరికీ నష్టం లేకుండా ధర నిర్ణయిస్తాం
రైతులు, వ్యాపారుల మధ్య సమన్వయం లేకపోతే ఇబ్బందులు వస్తాయని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. రైతులకు నష్టం లేకుండా, వ్యాపారులకు ఇబ్బంది కాకుండా ధరను నిర్ణయిస్తామని చెప్పారు. జీడి పంటలను మ్యాపింగ్ చేసి, పంట దిగుబడి ఆధారంగా వ్యాపారులకు ఎంత సరుకు అప్పగించాలన్న విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌కు జీడిరైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఆర్‌డిఒ పి.సీతారామ్మూర్తి, తహశీల్దార్ ఎల్.మధుసూదనరావు, ఎఎంసి చైర్మన్ పి.వి సతీష్, పిఎసిఎస్ అధ్యక్షులు పైల వెంకటరావు చిట్టి, ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, జీడి వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.










