
ప్రజాశక్తి- అనకాపల్లి, అచ్యుతాపురం
అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని రుషిల్ డెకార్ ప్లైవుడ్ కంపెనీ ముఠా కార్మికుల సమస్యలపై అనకాపల్లి కార్మిక శాఖ కార్యాలయంలో బుధవారం చర్చలు జరిగాయి. ఈ చర్చలు కొంతమేరకు కొలిక్కి రాగా, తదుపరి చర్చలు 26వ తేదీ వాయిదా పడ్డాయి. ముఠా కార్మికులకు పాత పద్ధతిలోనే కూలి రేట్లు చెల్లించాలని కోరుతూ కంపెనీ ఎదుట చేపట్టిన ఆందోళన 15వ రోజు బుధవారం కూడా కొనసాగింది. కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టికి ముఠా కార్మికులు వినతి పత్రం అందజేసిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు బుధవారం అనకాపల్లి కార్మిక శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో కంపెనీ ప్రతినిధులు పిఆర్‌ఓ నాగేష్, హెచ్‌ఆర్ మేనేజర్ రమేష్, కార్మిక శాఖ ఏసీఎల్ సువర్ణ, ఏఎల్‌వో బాలకృష్ణ, కార్మికుల తరుపున సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకరరావు, జి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్ రాము, దిబ్బపాలెం అభివృద్ధి కమిటీ చైర్మన్ బి రామదాసు, శ్రీరామ ముఠా కార్మిక సంఘం నాయకులు నానాజీ, సూరిబాబు, అప్పలనాయుడు చర్చల్లో పాల్గొన్నారు. కార్మికులకు లారీల యజమానులు డబ్బులు ఇవ్వద్దని పరిశ్రమ ఆవరణలో యాజమాన్యం పెట్టిన బోర్డులు తక్షణమే తొలగించాలని కార్మిక ప్రతినిధులు కోరగా, అందుకు యాజమాన్య ప్రతినిధులు అంగీకరించారు. మిగతా సమస్యలను వారం లోపు యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం మినిట్స్ రాసి తయారు చేసి యాజమాన్యం కార్మికులతో ఒప్పందం చేసుకోవడం జరిగింది.