
* పేరుకుపోయిన చెత్తా చెదారం
* మూలకు చేరిన చిన్నారుల ఆట పరికరాలు
ప్రజాశక్తి- పలాస: ఒకప్పుడు ఆ పార్కు వృద్ధులతో, మహిళలతో, చిన్నారులతో కలకల్లాడేది. ఒకవైపు వాకర్స్ వాకింగ్ చేస్తుండగా... మరో వైపు చిన్నారులు ఆట పరికరాలతో ఆట్లాడుకుంటూ సందడి చేసేవారు. మరోవైపు కోనేరులో జలకాలాడుతూ ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం ముత్యాలమ్మ కోనేరు (నెహ్రు పార్కు) ఆ పరిస్థితి కనుమరుగైంది. కొంత మంది వ్యక్తులు, మున్సిపల్ అధికారులు కలిసి లక్షలాది రూపాయలు బిల్లులు చేసి అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యాలమ్మ కోనేరు పార్కు మురుగు కూపంగా మారింది. 2002లో జరిగిన మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికల్లో వజ్ఞ బాబూరావు మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన వెంటనే లక్షలాది రూపాయలు మున్సిపల్ నిధులతో ముత్యాలమ్మ కోనేరును పార్కుగా అభివృద్ధి చేసి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డితో ప్రారంభించారు. మూడేళ్ల క్రితం ప్రత్యేకాధికారి పాలన రావడంతో పార్కును నామరూపాలు లేకుండా పోయింది. పార్కు అభివృద్ధి పేరుతో రూ.74 లక్షలు మున్సిపల్ నిధులు ఖర్చు పెట్టి రూపురేఖలు మార్చేశారు. తరువాత జరిగిన ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చినా పార్కు అభివృద్ధి వైపు పాలకులు గాని, అధికారులు గాని దృష్టిసారించకపోవడం ప్రజలకు శాపంగా మారింది. వాకర్స్ సంఘంగా రూ. 4 లక్షలు సేకరించి నడక దారిని శుభ్రం చేసినా... అదీ పాడైపోయింది. కాపలాదారుడు లేకపోవడంతో పార్కుకకు భద్రత లేకపోయింది. అలాగే పార్కు చుట్టూ గతంలో ఉన్న పెన్సింగ్ తొలగించారు. దీనిపై వాకర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, కార్యదర్శి రామానంద పండిత్ మాట్లాడుతూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్ర కుమార్‌ను వివిరణ కోరగా... ముత్యాలమ్మ కోనేరు వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలో పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.