ప్రజాశక్తి -డుంబ్రిగూడ: ఆన్లైన్ ప్రైవేట్ రుణ యాప్‌లతో గిరి యువత మోసపోవద్దని స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ సూచించారు. మండలంలోని గుంటసీమ పంచాయతీ సోబూరు, గుంటగన్నెల పంచాయతీ గన్నెలలో ఆదివారం ఆయన సందర్శించి సైబర్ క్రైమ్, ప్రైవేట్ రుణ యాప్‌లతో జరుగుతున్న మోసాలతో పాటు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్ ప్రైవేట్ రుణ యాప్‌లతో రుణాలు పొందిన వారికి యాప్ నిర్వాహకులు తీసుకున్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. దీంతో కొంతమంది ఒత్తిడికి లోనై డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా నిబంధనల కనుగుణంగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు.










