ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అప్పుల చుట్టూ తిరుగుతున్న వేళ రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య చోటుచేసుకుంటున్న వాగ్వాదం ఆశ్చర్యం కలిగిస్తోంది. మీ హయాంలో అప్పులు ఎక్కువ చేశారంటే, మీ హయాంలో ఎక్కువ చేశారంటూ రెండు పార్టీలు పరస్పరం విమర్శలకు దిగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థను ఎవరు ఎంతలా కుదేలు చేశారో వివరిస్తూ, అంకెలతో సహా లెక్కలను ప్రజల ముందు పెడుతున్నాయి. రెండు పార్టీల పరస్పర దూషణలు ఎలా ఉన్నప్పటికీ ఏటికేడాది రాష్ట్రం అప్పుల కుప్పగా ఎలా మారిందో, ఒక్కొక్కరి నెత్తి మీద ఎంత అప్పు పేరుకుపోయిందో ఈ వివాదం వల్ల సామాన్య ప్రజానీకానికి కూడా అర్ధమవుతోంది. మన రాష్ట్రమే కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇంతే. రాష్ట్రాలే కాదు, భారతదేశమే అప్పుల వలలో చిక్కుకుంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపుగా 46 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రుణభారం 2020 డిసెంబర్ నాటికి కోటి లక్షల కోట్ల రూపాయలు దాటిందని ఇటీవలే ఒక పరిశీలకుడు వెల్లడించారు. మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు అప్పుల వలయంలోనే ఉన్నాయి. జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా 'కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్' (సిబిఓ) దేశ ఆర్థిక వ్యవస్థను సమీక్షించి 2031 నాటికి ఆ దేశ రుణం జిడిపిలో 107 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. సరైన బాటలో ఆర్థిక వ్యవస్థను నడిపించకపోతే ఈ జాతీయ రుణ సంక్షోభం మరింత పెరుగుతుందని హెచ్చరించింది. రానున్న మూడేళ్ల కాలాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టాల్సిన కొన్ని చర్యలను కూడా సూచించింది. అది వేరే విషయం!
ఇక్కడ ప్రశ్నేమిటంటే, వ్యక్తులు, కుటుంబాలే కాదు రాష్ట్రాలు, దేశాలే అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. దీనికి కారణం ఏమిటి? నిండా మునిగిపోతున్నామని తెలిసినా చేయి చాచక తప్పని బలహీన స్థితికి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎందుకు చేరుకుంటున్నాయి? పోనీ, ఇంత అప్పులు తెచ్చినా సామాన్యుల స్థితి గతులు ఎందుకు మారడం లేదు? వ్యక్తుల స్థాయిలో అప్పులు పెరిగి రైతులు, చేనేత కార్మికులు వంటి సామాన్యులు బలవన్మరణాలు చెందుతుంటే, కొద్ది మంది వద్ద మాత్రం సంపద ఎలా పోగుపడుతోంది? కరోనా వంటి పెను విపత్తు సమయంలో కోట్లాది మంది వలస కార్మికులు ఆ మూల నుండి ఈ మూలకు దేశం నలుమూలల పాదయాత్రలు చేస్తున్న వేళ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెస్తూనే ఉన్నాయి కదా..! సంక్షేమం పేరుతో పప్పు బెల్లాలను పంచుతూనే ఉన్నాయి కదా? అయినా, దేశంలో వేళ్లమీద లెక్కపెట్టగలిగే వారు మాత్రం ఇళ్ల నుండి కదలకుండా లాభాలు ఎలా ఆర్జించగలిగారు? కీలకం ఏమిటంటే.. అప్పు తేవడం కాదు! ఎంత తెచ్చారన్నది కూడా కాదు. తెచ్చిన మొత్తంతో ప్రజల నిజజీవిత ప్రమాణాలను పెంచుతున్నారా లేదా అన్నదే! వేల కోట్ల రూపాయలు అప్పులుగా ఇస్తున్న ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి ఇతర ద్రవ్య సంస్థలు ఆచరణలో ఆ పనిని చేయనీయవు. వాటి దృష్టంతా తమ యజమానులైన కార్పొరేట్ల ఖజానాలు ఎలా నింపాలన్న దానిపైనే! నయా ఉదారవాద విధానపు సారాంశమిదే. నీకింత..నాకింత వంటి క్రోనీ క్యాపిటలిజపు గిచ్చుళ్లు దీనికి అదనం!
కేంద్రంలో మొన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు పాలన సాగిస్తున్న బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం, వైసిపిలు ఆ తానులోని ముక్కలే! మోడీ మాత్రం తానే పెద్దమొనగాడు అనిపించుకోవడానికి తాపత్రాయపడుతూ అడ్డగోలుగా ఈ విధానాన్ని అమలు జరుపుతున్నారు. పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, అధికారం కోసం ఎన్ని సంక్షేమ మొక్కులు మొక్కినప్పటికీ కీలకమైన విధానాలలో ఇసుమంత మార్పు కూడా లేదు. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలున్నాయనడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కాక మరేమిటి? అప్పుల మీద కొండంత రాగం తీస్తున్న ఈ రెండు పార్టీలకు అభివృద్ధి మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలకు భిన్నమైన విధానాలను అమలు చేయడానికి సిద్ధపడాలి. తెచ్చే అప్పులను నిజమైన, నికరమైన అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఖర్చు చేయాలి. అప్పుడే చేసిన అప్పులు తీర్చగలిగే విధంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఈ దిశలో చర్యలు తీసుకోకుండా విమర్శలతో కాలం గడిపినంత మాత్రాన ప్రయోజనమేమీ ఉండదు. అప్పుల ఊబి నుండి బయటపడే తరుణోపాయమూ కనపడదు.










