Sep 28,2023 21:34

కౌలు రైతులకు మొండిచేయి
పట్టించుకోని ప్రభుత్వం
కౌలుకార్డులు జారీచేసినా రుణాలివ్వని పరిస్థితి
ఏలూరు జిల్లాలో 58 వేల కౌలుకార్డుదారుల్లో 13 వేల మందికే లబ్ధి
'పశ్చిమ'లో 88వేల మందిలో 26 వేల మందికే రుణాలు
ప్రయివేటు వడ్డీవ్యాపారుల కబందహస్తాల్లో కౌలురైతులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
రెండు జిల్లాల్లోనూ వ్యవసాయసాగులో కీలక పాత్రపోషిస్తున్న కౌలురైతుల గురించి పట్టించుకునే నాధుడే లేకుండాపోయాడు. పంటసాగుచేస్తున్న వాస్తవ కౌలురైతులకు పంటరుణాలందని పరిస్థితి నెలకొంది. అరకొర రుణాలు మంజూరు చేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక కౌలురైతుల పరిస్థితి మరింతదారుణంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూయజమానులకు అవగాహన కల్పించడంలోగానీ, కౌలుకార్డులు జారీచేసిన రైతులకు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. బ్యాంకురుణాలందకపోవడంతో పెట్టుబడుల కోసం కౌలురైతులు ప్రయివేటు వడ్డీవ్యాపారుల కబందహస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు.
రెండుజిల్లాల వ్యవసాయసాగులో కౌలురైతులదే కీలకపాత్ర. సాగుచేస్తున్న భూమిలో 75 శాతం సాగు కౌలురైతులే చేస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో సాగుచేస్తున్న కౌలురైతుల గురించి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలుకార్డుల జారీ, పంటరుణాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. 2023-24 ఆర్థికసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ బ్యాంకులు కౌలురైతులకు జారీచేసిన రుణాలు లెక్కలు చూస్తే పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. అరకొరగా రుణాలు జారీచేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొంత ఫర్వాలేదనిపించినప్పటికీ, ఏలూరు జిల్లాలో మాత్రం కౌలురైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏలూరు జిల్లాలో 58,452 కౌలుకార్డులు జారీచేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. కౌలుకార్డులు జారిచేసిన రైతులకైనా రుణాలిచ్చారా అంటే అదీలేకుండా పోయింది. కేవలం 13వేల మందికి మాత్రమే రూ.52కోట్ల వరకూ రుణాలు మంజూరుచేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు కౌలుకార్డులు అందుకున్న 45వేల మంది కౌలురైతులకు రుణాలందని పరిస్థితి నెలకొంది. వీరంతా పంటరుణాల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 88వేల మంది కౌలురైతులకు కౌలుకార్డులు మంజూరు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. బ్యాంకు రుణాలు అందుకున్న కౌలురైతులు 26 వేల మంది మాత్రమే. వీరికి మంజూరు చేసిన రుణాలు రూ.130 కోట్లు మాత్రమే. కౌలుకార్డులు అందుకున్న దాదాపు 60వేల మందికిపైగా కౌలురైతులకు రుణాలివ్వ లేదు. ఈ జిల్లాలో జెఎల్‌జిఎల్‌, ఆర్‌ఎంజిఎల్‌ గ్రూపుల ద్వారా రూ.195 కోట్ల వరకూ రుణాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇది రైతులకు కొంత ఉపశమనం కల్పించే చర్యగా చెప్పొచ్చు. ఏదిఏమైనా వ్యవసాయ రుణ ప్రణాళికల్లో కౌలురైతులకు కేటాయించిన రుణాలు ఒక్కశాతం కూడా లేకుండాపోయింది. కనీసం కౌలుకార్డులు జారీచేసిన రైతులకు కూడా రుణాలివ్వకపోడం అత్యంత దారుణంగా చెప్పొచ్చు. దీంతో పెట్టుబడులకోసం కౌలురైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
ప్రయివేటు వడ్డీ వ్యాపారుల కబందహస్తాల్లో కౌలురైతులు
వాస్తవసాగుదారుడైన కౌలురైతులకు బ్యాంకులు పంటరుణాలందించడం లేదు. అరకొర రుణాలు జారీచేసి బ్యాంకులు మమ అనిపిస్తున్నాయి. ప్రభుత్వం సైతం కౌలురైతులకు రుణాలు మంజూరు గురించి గట్టి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కౌలురైతులు పెట్టుబడులకోసం ప్రయివేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. నూటికి రూ.మూడు, రూ.ఐదు వడ్డీకి అప్పులు తెచ్చి కౌలురైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో వడ్డీభారం తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ప్రతిఏటా ప్రకృతివైపరిత్యాలతో పంటలు దెబ్బతినడంతో అప్పులు తీరక, వడ్డీ భారంగా మారుతోంది. దీంతో కౌలురైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కౌలురైతుల రుణాల జారీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటేనే కౌలురైతులకు ఎంతోకొంత న్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారు.