ప్రజాశక్తి-కాకినాడ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సిసిఆర్‌సి కౌలు కార్డులున్న వారికి రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బ్యాంకు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఎల్‌డిఎం సిహెచ్‌ఎస్‌వి.ప్రసాద్‌తో కలిసి వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, వ్యవసాయ, పశుసంవర్థక, గ్రామీణాభివద్ధి తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 30 వేల పంట సాగుదారు హక్కు కార్డులు (సిసిఆర్‌సి) జారీ అయ్యాయని ఈ కార్డుదారులకు రుణాలను వీలైనంత త్వరగా అందించాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో బ్యాంకు బ్రాంచుల అధికారులతో సమన్వయం చేసుకుంటూ రుణాలు సత్వరం అందేలా చూడాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు (పశు సంవర్థక) ఉన్నవారికి రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు. జిల్లాలోని 414 రైతు భరోసా కేంద్రాల్లో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రైతులకు సేవలందేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎపి అమూల్ ప్రాజెక్టు-జగనన్న పాల వెల్లువ కార్యక్రమం త్వరలోనే కాకినాడ జిల్లాలో ప్రారంభం కానున్నందున ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి బ్యాంకులు తోడ్పాటు అందించాలన్నారు. 200 గ్రామాల్లో కార్యక్రమం అమలు కానుందని ఈ నేపథ్యంలో పాడిపశువుల యూనిట్లను కూడా గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించినందున పిఎంఇజిపి ద్వారా రుణాల మంజూరుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజరుకుమార్, పశుసంవర్థక అధికారి డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్‌రావు, డిఐసి జిఎం టి.మురళి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి హాజరయ్యారు.










