Sep 15,2023 23:00

మాట్లాడుతున్న రాధాకృష్ణ, తదితరులు

ప్రజాశక్తి-సత్తెనపల్లి : గుర్తింపు కార్డులు మంజూరు చేసిన కౌలు రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టి.హనుమంతరావు అధ్యక్షతన కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రాధాకృష్ణ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పల్నాడు జిల్లాలోని పంటలు, కరువు పరిస్థితులపై అధికారులతో చర్చించి వర్షాభావ మండలాలను గుర్తించి, ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ కౌలురైతు కార్డు ఇస్తామని ఉన్నత స్థాయి అధికారులు చెప్పినా కింది స్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదని తెలిపారు. కార్డులు మంజూరు చేసిన వారికి కూడా బ్యాంకులు రుణాల మంజూరులో జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో రుణాల కోసం ఈ నెల 27న లీడ్‌ బ్యాంకు ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పంటలు వేసే విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రబీలోనైనా వారికి కావలసిన విత్తనాలను సబ్సిడీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో వెంటనే ఉపాధి హామీ పనులను ప్రారంభించి వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజానీకానికి పనులు కల్పించి ఆదుకోవాలన్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా 16 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయాలని, జెఎల్‌జి గ్రూపులను ఏర్పాటు చేసి పంట రుణాలు ఇప్పించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు పి.మహేష్‌, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు.