Sep 02,2023 21:46

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* రైతులు, కౌలు రైతులకు తోడ్పాటు అవసరం
* లక్ష్యాలను పూర్తి చేయాలి
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌  : 
రుణ మంజూరులో కొంతమంది బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రైతాంగానికి, మహిళలకు సకాలంలో రుణాలు మంజూరు చేసి ఆర్థిక సాధికారత సాధించేందుకు దోహదపడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రుణాలు ఇవ్వాలన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడంలో కొన్ని బ్యాంకు శాఖల్లో అధికారులు సహకరించడం లేదన్నారు. దీనివల్ల సాగుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. బ్యాంకుల వారీగా ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత జిల్లా అధికారులు, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశ్రమలకు ఇచ్చిన రుణాల తిరిగి చెల్లింపులు, ఎంఎస్‌ఎంఇ లక్ష్యాలు జిల్లాలో తక్కువగా ఉందని, బ్యాంకులన్నీ లక్ష్యాలు పెంచాలన్నారు. విద్యా రుణాల మంజూరులో సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. సిసిఆర్‌సి కార్డులపై రుణాలు మంజూరుపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో ఎక్కువమంది కౌలు రైతులు ఉన్నారని, వారికి రుణాలు ఇవ్వడం ద్వారా సాగుకు ప్రోత్సహించవచ్చన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. వ్యవసాయ రుణాలు బ్యాంకుల వారీగా జాబితా అందజేయాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఆదేశించారు.
కొన్ని బ్యాంకు శాఖలనుంచి సహకారం అందడం లేదని పశు సంవర్థక శాఖ జెడి కిశోర్‌ కుమార్‌ సమావేశంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల లక్ష్యాలను పూర్తి చేయలేకపోతున్నామన్నారు. కొంతమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించడం లేదని, దీనివల్ల సాంకేతికంగా సమస్యలు తలెత్తి రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకర్లు చెప్పగా ఇటువంటి కారణాలు చూపి రుణాలు నిలుపుదల చేయడం సరికాదన్నారు. చేయూత, జగనన్నతోడు తదితర పథకాల్లో బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈనెలాఖరు నాటికి పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. డిఆర్‌డిఎ, మెప్మా, టిడ్కో, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రం రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో వచ్చిన వారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. గృహ హక్కు పత్రాలు తీసుకున్న వారు రుణాలు పొందవచ్చని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పత్రాలు పొందిన వారికి తెలియజేయాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు మొదటి దశలో రూ.లక్ష, రెండో దశలో రూ.రెండు లక్షలు మంజూరు చేయాలని వడ్డీ 5 శాతం వసూలు చేయాలన్నారు. జిల్లాలో 15 వేల మందికి రుణాలు మంజూరు లక్ష్యమన్నారు. రుణాలు మంజూరుకు బ్యాంకులన్నీ దృష్టిసారించాలని చెప్పారు. సమావేశంలో ఎల్‌డిఎం ఎం.సూర్యకిరణ్‌, ఎస్‌బిఐ రీజనల్‌ హెడ్‌ ఎం.వి తిలక్‌, నాబార్డు డిడిఎం కె.వరప్రసాద్‌, ఆర్‌బిఐ ఎజిఎం అనిల్‌, జిల్లా అధికారులు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.