Sep 23,2023 00:00

ప్రజశక్తి - చీరాల
1998 డిఎస్సిలో క్వాలీఫై అయిన ఉద్యోగాల ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు ఉద్యోగాలు రాక తీవ్ర అన్యాయం జరిగిందని డియస్సి అభ్యర్థులు ఆరోపించారు. పట్టణంలోని పాపరాజుతోట భాపనమ్మ కళ్యాణ మండపంలో జగనన్నకు విన్నపం అనే అంశంపై డీఎస్సీ అభ్యర్థులు విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఉద్యోగాలకు క్వాలిఫై అయి దశాబ్ద కాలం పోరాట ఫలితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. 98డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులకు తొలుత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన 6800మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇచ్చిన జగన్‌ కేవలం 4072ఉద్యోగాలు ఇవ్వడంతో అర్హత ఉండి కూడా  2300మంది రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 726మందికి ఉద్యోగాలు రావాల్సి ఉండగా 506మందికే వచ్చాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీఎస్సీ 98లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో రత్నబాబు, సత్యం, రవి, మనోజ్, కటారి అంజయ్య, వీరాస్వామి, సాయి గీత, సుహాసిని, లక్ష్మీ జానకి, కరుణ కుమారి పాల్గొన్నారు.