రాయచోటి టౌన్ : మదనపల్లె పట్టణంలో సంచలనం సష్టించిన రుక్సానా హత్య కేసును సిబిసిఐడికి అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. మంగళవారం రాయచోటి పట్టణంలో సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్. రెడ్డయ్య, మైనారిటీ హక్కుల పోరాట సమితి నాయకులు షరీఫ్, ర్కెతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఫయాజ్, రజక సంఘం నాయకులు రమేష్ ప్రసంగించారు. అసలు దోషులను కాకుండా నిర్దోషులను రుక్సానా హత్య కేసులో మదనపల్లె పోలీసులు ఇరికించారని ఎఫ్‌ఐఆర్ కాపీలను చూస్తే స్పష్టం అవుతుందని వివరించారు. ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్ ఒకసారి నమోదైన తర్వాత సవరణలు చేసుకోవచ్చు, కానీ ఫిర్యాదును మార్చడం చట్ట విరుద్ధమని, రుక్సానా కేసులో ఒకే ఎఫ్‌ఐఆర్‌లో రెండు ఫిర్యాదులు, రెండు రకాల ముద్దాయిల జాబితా ఉందని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో మొదట 15 మంది ముద్దాయిలను చేర్చిన మదనపల్లె పోలీసులు రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి కేవలం తొమ్మిదిని చేర్చి, హత్యతో సంబంధం లేని రుక్సానా భర్త అయిన ఖదీర్ అహమ్మద్, బావ షబ్బీర్ లను ప్రధాన ముద్దాయిలుగా చేర్చారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల అనుచరులను కేసు నుంచి తప్పించడం కోసమే ఒకే రకమైన ఎఫ్‌ఐఆర్ రెండుగా ఆన్ లైన్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను తారుమారు చేసినా, అనవసరంగా నిర్దోషులను వేధింపులకు గురి చేసినా పోలీసులు శిక్షార్హులు అవుతారని తెలిపారు. రుక్సానా హత్య కేసును పలు మలుపులు పోలీసులే వారికి అనుకూలంగా తిప్పుతున్నారని దీనివల్ల కేసు నీరుగారే అవకాశం ఉన్నందున సిబి సిఐడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కూడగట్టి పోరాటం చేయనున్నట్లు వివరించారు. రుక్సానా హత్య కేసును సిబి సిఐడికి అప్పగించాలని అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.










