Aug 26,2023 21:02

రుక్సానా హత్య కేసును సిబిఐకి అప్పగించాలి

మదనపల్లె అర్బన్‌ : మదనపల్లె పట్టణంలో సంచలనం సష్టించిన రుక్సానా హత్య కేసును సిబిఐకి అప్పగించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంగడి కృష్ణమూర్తి, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఎఐఎల్‌యు) జిల్లా నాయకులు కె.సోమశేఖర్‌, భారతీయ అంబేద్కర్‌ సేన జిల్లా కన్వీనర్‌ ముత్యాల మోహన్‌, మదనపల్లె న్యాయవాదుల సంఘం కోశాధికారి జి.ఎన్‌.సురేష్‌ బాబు, ఎఐఎల్‌యు మదనపల్లె నాయకులు పి.శ్రీరాములు, మతురాలు రుక్సానా మామ ఖాదర్‌వల్లి తదితరులు ప్రసంగించారు. ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్‌ ఒకసారి నమోదైన తర్వాత సవరణలు చేసుకోవచ్చు కానీ ఫిర్యాదును మార్చడం చట్ట విరుద్ధమని తెలిపారు. రుక్సానా కేసులో ఒకే ఎఫ్‌ఐఆర్‌లో రెండు ఫిర్యాదులు, రెండు రకాల ముద్దాయిల జాబితా ఉందని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌లో మొదట 15 మంది ముద్దాయిలను చేర్చిన పోలీసులు రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి రెండవ సారి అదే క్రైం నంబర్‌తో ఎఫ్‌ఐఆర్‌ తయారుచేసి కొంతమంది పేర్లు తీసేసి, మరికొంత మందిని అదనంగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అనుచరులను కేసు నుండి తప్పించడం కోసమే ఒకే నంబర్‌ ఎఫ్‌ఐఆర్‌ను రెండు సార్లు తయారుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను తారుమారు చేసి, రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి ముద్దాయిల పేర్లను తొలగించడం వలన కేసు నీరుగారిపోతుందనే అభద్రత పట్టణ ప్రజల్లో నెలకొన్నదన్నారు. దారుణమైన హత్యలో భాగస్వామ్యం ఉన్న నిందితులు శిక్ష నుండి తప్పించుకుంటే ప్రజలకు రక్షణ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు రుక్సానా హత్య కేసులో తమ నిజాయితీని నిరూపించుకోవాలని, సిబిఐకి ఈ కేసును సిబిఐకి అప్పగించి, నిష్పక్షపాత విచారణకు సకరించాలని డిమాండ్‌ చేశారు. రుక్సానా హత్య కేసును సిబిఐ విచారణ చేపట్టాలని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను కూడగట్టి పోరాటం చేయాలని తీర్మానం చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు