ప్రజాశక్తి - బాపట్ల
వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయలు నొక్కేసి నాసిరకంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. పదేళ్ళలో పెరిగిన బాపట్ల జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎమ్మెల్యే కోన రఘుపతి విఫలమయ్యారని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆరోపించారు. టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ, మ్యానిఫెస్టో కరపత్రాలు, మహిళలకు చీరలను స్థానిక 1వ వార్డు రామకృష్ణాపురంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ పేరుకే జిల్లా కేంద్రమని, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి మాత్రం లేదని అన్నారు. పట్టణంలో పారిశుధ్య పనులు చేయడంలేదన్నారు. మురుగునీటి కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. దీంతో దోమల బెడద, అంటువ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తగినంత తాగునీటి సరఫరా లేక ప్రజలు డబ్బులు పెట్టీ మంచినీరు కొనుక్కొని త్రాగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రోడ్లు మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయల కాంట్రాక్టులు పొంది వైసీపీ నాయకులు నాసిరకంగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడి పట్టణంలో పనులు మందకొడిగా సాగడంతో జనజీవనం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. టిడిపి ప్రభుత్వంలో మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాలు అమలు చేశామని పేర్కొన్నారు. తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక మహిళా శక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, అంకాల శ్రీనివాసరావు, సందు సాంబశివరావు, సోముల ప్రసాద్, నాయకులు ఫరీద్ మస్తాన్, మందపాటి ఆంద్రేయ, బొడ్డు గోవిందు, కాలింత దిలీప్ పాల్గొన్నారు.










