రూ.కోట్ల విలువ చేసే భూఆక్రమణలపై...
మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
శ్రీ కాన్వారుని అడ్డుకున్న మహిళలు శ్రీ బయటపడిన వైసిపి గ్రూపులు
ప్రజాశక్తి - శాంతిపురం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన గుడిపల్లి మండల పర్యటన సందర్భంగా శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద నిరసన సెగ తగిలింది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని అధికార పార్టీకి చెందిన సర్పంచి జగదీష్, ఎంపిటిసి సభ్యుడు ఆర్ముగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజులుగా ఈ సమస్యపై రెవెన్యూ అధికారులకు, కుప్పం ఇన్‌ఛార్జి ఎంఎల్‌సి భరత్‌కు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియజేయాలని మొరసనపల్లి పంచాయతీ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎంఎల్‌సి భరత్ మంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని తెలపడంతో నిరసన విరమించారు. అయితే మంత్రి కాన్వారు ఆగకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహించిన సర్పంచి, ఎంపిటిసిలు ప్రజలతో కలిసి మరోసారి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాళ్లబూదూగూరు ఎస్‌ఐ అక్కడకు చేరుకుని తిరుగు ప్రయాణంలో మంత్రి వద్ద మాట్లాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరసనపల్లి పంచాయతీ సర్పంచి, ఎంపిటిసిలతో మాట్లాడారు. బుల్లెట్ దండపాణి, రామచంద్రన్‌లు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని, ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించుకునేందుకు కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలు విన్న మంత్రిపెద్దిరెడ్డి సమస్యను వెంటనే పరిష్కరించాలని కుప్పం ఆర్డీవో, రెవెన్యూ అధికారులకు సూచించారు. ఏదిఏమైనా ఈ ఘటన కుప్పంలోని రెండు గ్రూపుల విబేధాలను బహిర్గతం చేసింది.
పెద్దిరెడ్డి కాన్వారు ఆపకపోవడంతో మహిళల నిరసన










