Oct 26,2023 00:00

ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు, నాయకులు

ప్రజాశక్తి-దుగ్గిరాల : పొలాలకు సాగునీటి కోసం నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద రైతులు బైటాయించారు. ఎనిమిదేళ్ల నుండి హైలెవల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేయని కారణంగా తామిప్పుడు రూ.లక్షలు ఖర్చు చేసి ఇంజన్ల ద్వారా పైరుకు నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైలెవల్‌ ఛానల్‌ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు సరిగా అందకపోవడంపై రైతులు హైలెవల్‌ ఛానల్‌ పోరాట కమిటీ, అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో దుగ్గిరాలలోని జలవనరుల శాఖ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శిశంకరరావు, తెలుగు రైతు సంఘం నాయకులు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, ఇతర నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌కు రూ.కోటి చెల్లిస్తే హైలెవల్‌ ఛానల్‌ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. అయితే రైతుల పట్ల ప్రభుత్వ చిన్నచూపు కారణంగా నిధులు చెల్లించడం లేదని, దీంతో ఛానల్‌ పరిధిలోని 26 వేల ఎకరాల వరి పైరు ఎండి పోయే దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పుడు రైతులు ఇంజన్ల ద్వారా నీరు పెట్టుకుం టున్నా పొలాలకు సరిగా అందడం లేదని అన్నారు. పెద్దవడ్లపూడి వద్ద పంట కాల్వలో రెండున్నర మీటర్ల ఎత్తున రైల్వే శాఖకు చెందిన మెటల్‌ పడి నీరు పారుదల కావడం లేదని, రైల్వే శాఖతో వెంటనే సంప్రదించి పొలాలకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. పంట కాల్వలోని తూటికాడును తొలగిం చాలన్నారు. గంటపాటు ధర్నా అనంతరం రైతుల వద్దకు ఎఇ వై.విద్యావతి వచ్చారు. ప్రస్తుతం డెల్టా ప్రధాన కాల్వకు నాలుగు వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోందని, పులిచింతల నుండి మరో రెండు వేల క్యూసెక్కులు 24 గంటల్లో ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుతుందని చెప్పారు. మొత్తం 6 వేల క్యూసెక్కులు విడుదలైతే హై లెవెల్‌ ఛానల్‌కు అందిస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమి ంచారు. అధికారులు చెప్పిన విధంగా నీరు విడుదల చేయకుంటే మళ్లీ ఆందోళన చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ధర్నాలో వివిధ సంఘాల నాయకులు ఎం.శివసాంబిరెడ్డి, ఎన్‌.యోగేశ్వర రావు, జె.బాలరాజు, కె.బాబూప్రసాద్‌, ఎం.నాగమ ల్లేశ్వరరావు, వై.బ్రహ్మేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, బి.శివసామిరెడ్డి, జి.వెంకటరావు, బి.శ్రీకృష్ణప్రసాద్‌, వి.శ్రీనివాసరావు, టి.సీతారామయ్య, ఎమ్‌డి.నిజా ముద్దీన్‌, టి.అశోక్‌, బి.నాగరాజు, పి.శ్రీనివాసరావు, వినోద్‌, వేణు, సుహాస్‌, శివయ్య పాల్గొన్నారు.