
రుద్రవరంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయండి
మధ్య దళారుల దోపిడీ నుండి రైతాంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
ప్రజాశక్తి - రుద్రవరం
ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రుద్రవరం, సిరివల్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో రైతులు పండించిన మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు ప్రభుత్వాన్నికోరారు. గురువారం మహాదేవపురం, కోటకొండ, కె,కొత్తూరు , ఎల్లా వత్తల్ల, శ్రీరంగాపురం, పెద్ద కంబలూరు, అప్పనపల్లె గ్రామాల్లో మొక్కజొన్న ఆరబెట్టిన కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న వేసినప్పటినుండి మొలక దశలో అధిక వర్షాలు కురిసాయి. పంట కంకి దశలో సరైన వర్షాలు కురవలేదు. ఒక్కొక్క ఎకరాకు సుమారు 40 వేల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టారు. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడి వచ్చినది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారస్తులు కల్లాల వద్దకు వచ్చి చింత కేవలం 1900 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. వారం పది రోజుల తర్వాత డబ్బులు ఇస్తామంటున్నారు.రోజు బాగా ఎండ ఉన్నది అని రోడ్ల వెంట గింజలు ఆరబోస్తే సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు విపరీతంగా వచ్చి కొంత మేర వర్షం కురసి గింజలుతడుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు వర్షం వస్తుందో గింజలు తడిసిపోతాయో ఆందోళనలో రైతులు ఉన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారులు రైతుల వద్దకు వచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంట కొనుగోలు చేస్తామని చెప్పడం లేదు. ఆర్ బి కే కేంద్రాల్లో పంట నమోదు చేసుకున్న కూడా కొనుగోలు చేయుటకు వ్యవసాయ అధికారులు ఇప్పటివరకు రాలేదు. విత్తనం వేసేటప్పుడు నుండి పంట అమ్ముకునే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వెంట రైతాంగం గింజల వద్ద కాపలా కాస్తుంటే కనీసం మేమున్నాము మీ గింజలు కొనుగోలు చేయిస్తాము అని చెప్పడానికి ముందుకు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో మొక్కజొన్న కొనుగోలుకు క్వింటాలకు 1960 నుండి 2090 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించినది. ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర జీవోలు ఉన్నాయి .కానీ వాటి అమలు మాత్రం జరగడం లేదు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, తక్షణమే రుద్రవరం మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మండలంలో ఉన్న రైతులందరి మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, స్థానిక ఎమ్మెల్యే గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వెంటనే జోక్యం చేసుకొని తాలూకాలోని రైతాంగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మద్దతు ధరతో మొక్కజొన్నలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, మధ్య దళారుల దోపిడీ నుండి ఆళ్లగడ్డ తాలూకా రైతాంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని ప్రకటన ద్వారా కోరారు. మద్దతు ధర అమలు కోసం రైతులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం ద్వారా సాధించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన మార్క్ఫెడ్ మేనేజర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడం జరుగుతుందని రైతులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. ఆయన వెంట పలువురు రైతు సంఘం నాయకులు ఉన్నారు.