ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.9065 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామని లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు రూ.7,475కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,590 కోట్లు చొప్పున కేటాయించినట్టు చెప్పారు. అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.5,823 కోట్లు, ఇందులో పంట రుణాలు రూ.3,432 కోట్లు చొప్పున విభజించినట్టు వివరించారు. వీటితోపాటు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌లకు విరివిరిగా నిధులు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈసారి దీర్ఘకాలిక రుణాలకు కూడా ఎక్కువ మొత్తంలోనే కేటాయింపులు జరిగాయని, వీటన్నింటినీ రైతులు, వ్యాపారులు, చిన్న పరిశ్రమలు పెడదామనుకునేవారు ఉపయోగించుకోవాలని కోరారు. తనను కలిసిన ప్రజాశక్తికి ఎల్‌డిఎం ఎ.శ్రీనివాసరావు ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఈ ఏడాది రుణ ప్రణాళిక ఏ విధంగా ఉంది?
వార్షిక రుణ ప్రణాళిక గతంతో పోలిస్తే బాగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ.7509కోట్లతో రుణ ప్రణాళిక రూపొందించాం. లక్ష్యానికి మించి (106.1శాతం) రూ.7,975 కోట్ల మేర రుణాలు అందజేశాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,065 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక రూపొందించాం. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు రూ.7,475కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,590 కోట్లు చొప్పున కేటాయించాం.
వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత?
మొత్తం కేటాయింపులో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. మొత్తంగా రూ.5,823కోట్లు కేటాయించగా ఖరీఫ్ పంట రుణాలకు రూ.2,025 కోట్లు, రబీ పంటలకు రూ.1,407 కోట్లు చొప్పున అందజేయాలని జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ సలహా మండలి నిర్ణయించింది. ఇవి కాకుండా రైతులకు రూ.2,136 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలు, కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ గిడ్డంగులు, వాటర్‌షెడ్, బయోగ్యాస్ వంటి రూపాల్లో అగ్రీకల్చర్ ఇన్‌ఫ్రా డవలప్‌మెంట్ కోసం రూ.101కోట్లు, అగ్రీ క్లినిక్స్, అగ్రీ బిజినెస్ సెంటర్స్, అగ్రీ సొఐటీలు, మైక్రో ఫైనాన్స్ తదితర రూపాల్లో రూ.154కోట్లు చొప్పున అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు ఎలా ఉన్నాయి?
వ్యవసాయ రుణాలతోపాటు స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్నపరిశ్రమల ఏర్పాటు తదితరాలన్నింటినీ ప్రభుత్వం ప్రాధాన్యతారంగాలుగా భావిస్తుంది. మొత్తం ప్రాధాన్యతా రంగాలకు రూ.7,475కోట్లు కేటాయించగా, ఇందులో వ్యవసాయరంగం మినహా మిగిలిన వాటికి రూ.441కోట్లు, కేవలం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.1,211 కోట్లు కేటాయించాం. రూ.20లక్షల నుంచి రూ.25లక్షలు దాటిన హౌసింగ్, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్స్ తదితరాలు ప్రాధాన్యేతర రంగాల్లోకి వస్తాయి. వీటికి రూ.1,590కోట్లు కేటాయించాము.
కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చే అవకాశం ఉందా?
కౌలు రైతులకు కూడా తప్పకుండా బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంది. కౌలు రైతులకు సిసిఆర్‌సి (క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు)లను రెవెన్యూ అధికారులు జారీచేస్తున్నారు. వీటి ఆధారంగా బ్యాంకులో పంట రుణాలు పొందేందుకు సౌలభ్యం ఉంది. జిల్లాలో 10,176 మంది కౌలు రైతులు ఉన్నట్టు సమాచారం. వీరిలో 1180మందికి సిసిఆర్‌సి కార్డులు ఉన్నాయి. వీరంతా నిరభ్యంతరంగా రుణాలు పొందవచ్చు. వీరికోసం ఈ ఏడాది రూ.34కోట్లు కేటాయించడం జరిగింది. వీరి మాదిరిగానే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 195మంది చేనేత కార్మికులకు రూ.97.50కోట్లు కేటాయించాం.
బ్యాంకు లింకేజీ రుణాల పరిస్థితి ఎలా ఉంది?
బ్యాంకు లింకేజీ రుణాలు కూడా ఏటా లక్ష్యానికి మించి ఇస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రూ.1,042కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలు అందజేయాలని లక్ష్యం పెట్టుకోగా ఆచరణలో రూ.1,170కోట్ల మేర ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో రూ.175కోట్లకు గాను రూ.243కోట్లు పంపిణీ చేశాం. ఈ ఏడాది (2023-24వ ఆర్థిక సంవత్సరం) గ్రామీణ ప్రాంతంలో 1,765కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.349కోట్లు మేర రుణ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించాం. ముద్రా లోన్లు గత ఏడాది జిల్లా వ్యాప్తంగా రూ.360కోట్ల మేర ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.289కోట్లు (80శాతం) మేర రుణాలు అందజేశాం.










