
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు జెడ్పీ స్థాయి సంఘం ఆమోదం తెలిపింది. శుక్రవారం జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరిగిన 1వ స్థాయి సంఘ సమావేశంలో ప్రస్తుత సవరణ బడ్జెట్, వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.32.24 కోట్లు రాబడులు పెరుగుతాయని అంచనా వేశారు. దీనిని తర్వాత జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదిస్తారు. ఆమోదిత బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడులు రూ.869 కోట్ల ఒక లక్ష, 53 వేలు, ఖర్చులు రూ.828 కోట్ల 83 లక్షల 42 వేలుగా, మిగులు బడ్జెట్ కింద రూ.40 కోట్ల 18 లక్షల 11 వేలుగా అంచనా వేశారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన సవరణ బడ్జెట్‌లో రాబడులు రూ.836 కోట్ల 76 లక్షల 78 వేల 407గాను, ఖర్చులు రూ.811 కోట్ల 50 లక్షల, 58 వేల 340లుగా, మిగులు బడ్జెట్ రూ.25 కోట్ల 26 లక్షల 20 వేల 67లుగా చూపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ రిజిస్ష్రేన్ శాఖ నుండి స్టాంప్ డ్యూటీ సర్‌చార్జీ కింద జెడ్పీకి రావాల్సిన రూ.2.5 కోట్లు విడుదల చేసినందుకుగాను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధ్యాయుల సస్పెన్షన్లు అన్యాయం : ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల్ని సస్పెన్షన్లు చేస్తున్నారని, ఇది సరికాదని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. దీని వల్ల మిగిలిన ఉపాధ్యాయుల్లో ఆసక్తి సన్నగిల్లుతుందని, అభద్రతా భావం వస్తుందని చెప్పారు. పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ పాఠశాలలు తనిఖీ చేస్తున్నారని, వర్క్‌బుక్స్ ఇవ్వలేదని, పిల్లలు రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ మరునాడే జిల్లా అధికారులు ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేస్తున్నారని ఉదహరించారు. మరోవైపు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయొద్దని అధికారులకు సంక్షిప్త సందేశాలు పంపుతున్నారన్నారు. రెండ్రోజుల క్రితం గుంటూరు రూరల్ మండలం, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం సస్పెన్షన్ అన్యాయమన్నారు. సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయకుంటే ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై విన్నవించేందుకు ఆర్‌జెడి కార్యాలయంలో అందుబాటులో ఉండట్లేదని మండిపడ్డారు. గుంటూరులో ఆర్‌జెడి కార్యాలయం ఉన్నా ఎప్పుడూ ప్రకాశం జిల్లాలోనే ఉంటున్నారని, సమస్యలు ఎలా విన్నవించాలని ప్రశ్నించారు. జెడ్పీ సమావేశాలకు సైతం ఏదో ఒక కారణంతో జిల్లా విద్యాశాఖ అధికారులు గైర్హాజరు అవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాకుమాను బాలికల గురుకుల పాఠశాలకు తాగునీటి వసతికి 9 నెలల క్రితం నిధులు మంజూరైనా పనులింకా ప్రారంభించకపోవటం సరికాదన్నారు. జెడ్పీ నుండి పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ త్వరితగతిన అందచేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను లక్ష్మణరావు కోరారు.
బిల్లులు, కేటాయింపులపై సభ్యుల అసంతృప్తి
మండలాలకు కేటాయింపులు, చేసిన పనులకు సంబంధించి బిల్లులు విడుదల కాకపోటంపై పలువురు జెడ్పీటిసి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో జెడ్పీటీసీ గది నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసిన తర్వాత నిధులు మాత్రం ఇవ్వట్లేదని జెడ్పీటీసీ అన్నారు. ఈపూరు మండలంలో జగనన్న కాలనీలకు రోడ్లు వేసిన బిల్లులు నాలుగేళ్ల నుండి విడుదల కాలేదని, దీంతో అప్పులు చెల్లించడానికి పొలాలు ఆమ్ముకోవాల్సి వస్తోందని ఈపూరు జెడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.25 లక్షల పనులకు ప్రతిపాదనలు ఇస్తే కేవలం రూ.10 లక్షలకే మంజూరు చేశారని, దీంతో అనేకచోట్ల రోడ్లు మధ్యలో నిలిచిపోయాయని కాకుమాను జెడ్పీటీసీ గుల్జార్‌బేగం ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ఉన్న నిధులనే అందరికీ సమానంగా ఇస్తున్నామని చెప్పారు. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండట్లేదని, కొన్నిచోట్ల కొరత ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని గుంటూరు జెడ్పీటీసీ తుమ్మల సుబ్బారావు కోరారు.