Jun 22,2023 01:07
మాట్లాడుతున్న ఎంపీడీవో రాధాకృష్ణ

ప్రజాశక్తి-బాపట్ల: వైఎస్సార్‌ క్రాంతి పథం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి క్రెడిట్‌ క్యాంపులు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని బాపట్ల ఎంపీడీవో పి రాధాకృష్ణ అన్నారు. బుధవారం బాపట్ల వైఎస్సార్‌ క్రాంతి పథం కార్యాలయంలో నిర్వహించిన క్రెడిట్‌ క్యాంపుల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అనే అంశంపై ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బాపట్ల మండలంలో 6 వేల 2 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.83 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన వివిధ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 35 శాతం సబ్సిడీతో రుణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏఈఓ ప్రశాంతి మాట్లాడు తూ వ్యవసాయ శాఖకు సంబంధించి ఐదుగురు రైతులతో గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని వ్యవసాయ శాఖ అందించే పరికరాలను 40 శాతం సబ్సిడీతో పొందవచ్చని అన్నారు. మత్స్యశాఖ ప్రతినిధి జి మరియదాసు మాట్లాడుతూ ఫిష్‌ ఆంధ్ర యూనిట్‌ ఏర్పాటుకు సబ్సిడీ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. అదేవిధంగా బోటు, వల, ఇంజన్‌ ఒక యూనిట్‌గా సబ్సిడీతో ఇస్తున్నట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పశు బీమా పథకంతో డైరీ యూనిట్‌ ఏర్పాటుకు 35 శాతం సబ్సిడీతో ఉన్న అవకాశాలను పాడి రైతులు వినియోగించుకోవాలన్నారు. వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపిఎం డి. సురేష్‌ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సబ్సిడీతో కూడిన యూనిట్లతో పాటుగా కిరాణా, బట్టలు, చిరు వ్యాపారాలతో పాటు గేదెలు, గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సిసిలు సుమలత, రత్నరాజు, శివరాం ప్రసాద్‌, ప్రకాష్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, విఓఏలు వివిధ గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.