Jan 22,2023 23:51

గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఒడిశా పోలీసులు

ప్రజాశక్తి -సీలేరు: ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధి పప్పులూరు పంచాయతీ గిల్లిగూడ గ్రామ అటవీ ప్రాంతంలో 35 ఎకరాల్లోని సుమారు 20వేల గంజాయి మొక్కలను ఆదివారం పోలీసుల ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.
ఆపరేషన్‌ గంజాయిలో భాగంగా చిత్రకొండ ఎస్‌ఐ అనిల్‌ పోలిడా ఆధ్వర్యంలో ఎక్సైజ్‌,స్పెషల్‌ పార్టీ పోలీసులు గంజాయి తోటలపై విస్తృత దాడులు నిర్వహించారు. గిల్లిగూడ అటవీ ప్రాంతంలో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరమని గిరిజనులకు అవగాహన కల్పించారు. గిరిజనులకు పదేపదే చెబుతున్నప్పటికీ తీరు మారకోవడం సరికాదని, గంజాయి సాగు, రవాణా ద్వారా కేసులు, జైళ్లు పాలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అయినప్పటికీ కొందరు గిరిజనులు తీరులో మార్పు రాకపోవడంతో ఆపరేషన్‌ గంజాయి చేపట్టి ధ్వంసం చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చేనెల 15వరకు ఆపరషన్‌ గంజాయి కొనసాగుతుందని, పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, గంజాయి మూలాలుండి, సాగుకు స్వస్తి చెప్పని గ్రామాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు. దాడుల్లో పట్టుబడిన నిందితులపై కేసులు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా గిరిజనులు నిషేధిత గంజాయి సాగుకు స్వస్తి పలకాలని, ప్రభుత్వం ఇస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.