ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సుమారు రూ.7కోట్లతో పలు డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ, అత్యవసర సమావేశాలు జరిగాయి. పలు అంశాలపై సభ్యులు చర్చించారు. సాధారణ సమావేశంలో పొందుపరిచిన 17 అంశాలకు, అత్యవసర సమావేశంలో పొందుపరిచిన 5 అంశాలకు ఆమోదం తెలిపారు. సభ్యులు తీర్మానించిన 3అంశాలకు ఆమోదం లభించింది. అనంతరం మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్వంలో నగరంలో అనేక అభివద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని సుందరీకరణ పనులు పూర్తయ్యాయని, దీంతో నగరం ఆకర్షణీయంగా కనిపిస్తోం దన్నారు. ఈనెల 27 నుంచి నగరంలో జరుగనున్న కుల గణనకు అందరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఈనెల 19న ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ను మహిళా పార్కులో పెద్ద తీరపై నుండి మహిళలు తిలకించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. కుక్కలకు గర్భనిరోధక శస్త్ర చికిత్సలు చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ రహదారులపై విచ్చలవిడి ఆక్రమణలు లేకుండా నిరంతరం పర్యవేక్షించే విధంగా అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో కమిషనర్ ఆర్ శ్రీరాముల నాయుడు, సహాయ కమిషనర్ ప్రసాద్ రావు, కోఆప్షన్ సభ్యులు ఆసపు వేణు, అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.