
ప్రజాశక్తి - యలమంచిలి
అమృత్ పథకంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని వెనుకబడిన తరగతుల హౌసింగ్ కాలనీలకు మంచినీటి సదుపాయం కల్పించే నిమిత్తం రూ.7.30 కోట్లు మంజూరు కాగా, వాటి ప్రాజెక్టు తయారు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిల్ అత్యవసర సమాశంలో చైర్‌పర్సన్ పీలా రమాకుమారి అధ్యక్షతన జరిగింది. అన్‌టైడ్ నిధులు రూ.62.80 లక్షలతో వివిధ వార్డుల్లో సిసి కల్వర్టులు, సిసి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడానికి చేసిన ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతిపాదించిన పనుల విలువ రూ.5లక్షలు, అంతకన్న తక్కువ ఉండే పనులను నామినేషన్ పద్ధతిలో చేపట్టాలని కౌన్సిల్ తీర్మానించింది. ఎడ్లగెడ్డ రిజర్వాయర్ హెడ్ స్లూయిస్ షట్టర్ ఏర్పాటు చేయడానికి రూ.5లక్షలు మంజూరు చేయడానికి ఆమోదించారు. టిడ్కో ఇళ్లు కేటాయింపులో డిపోజిట్ కట్టి ఇల్లు మంజూరు కాని లబ్ధిదారులకు సెప్టెంబరు మొదటి వారంలో వారు కట్టిన సొమ్ము తిరిగి చెల్లించడం జరుగుతుందని, లబ్ధిదారులంతా వచ్చి వారి వారి బ్యాంకు ఖతాలను తెలియజేయాలని చైర్‌పర్సన్ కోరారు. పంట కాలవ పనులు అత్యవసరంగా చేపట్టాలని సభ్యులు కోరారు. సమావేశంలో కమిషనర్ వీరయ్య, వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్తా, మేనేజరు ప్రభాకరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పల్లా శ్రీనివాస్, టిపిఓ శ్రీలక్ష్మి, ఆర్‌ఓ నీలిమ, సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.