ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో 7,550 మంది తల్లుల ఖాతాలకు రూ.7 కోట్ల 25 లక్షల 42 వేల జగనన్న వసతి దీవెన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. బుధవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజక వర్గం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నార్పల వేదికగా జగనన్న వసతి దీవెన ఆర్దిక సహాయం విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం నుండి ప్రత్యక్ష ప్రచారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకుని వచ్చిందన్నారు. ప్రభుత్వ అందిస్తన్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నారు. జిల్లాలో 5545 మంది గిరిజన విద్యార్దులకు రూ. 5కోట్ల 35 లక్షల12, 500లు, 314 మంది ఎస్సీ విద్యార్దులకు రూ.29లక్షల 22 వేలు, 500, 1228 మంది బిసి విద్యార్దులకు రూ.1 కోటి 16 లక్షల 60 వేలు, 128 మంది ఇబిసి విద్యార్దులకు రూ.12లక్షల 25 వేలు, 280 మంది కాపు విద్యార్దులకు రూ.26లక్షల 97 వేల 500, తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. 10 మంది క్రిష్టియన్ మైనారిటీ విద్యార్దులకు రూ.1 లక్ష, 45 మంది ముస్లిమ్ మైనారిటీలకు రూ.4 లక్షల 25 వేలు జమ చేసారని చెప్పారు. అనంతరం లబ్దిదారులకు మోగా చెక్కును పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఐ. కొండలరావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి ఎల్.రజని, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, ఎంపిపి ఎస్.రత్నకుమారి, చింతలవీధి సర్పంచ్ సీతమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, పలువురు తల్లులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










