
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : సిపిఎం ఆధ్వర్యంలో 15న విజయవాడలో నిర్వహించే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి కోరారు. ఈ మేరకు మండలంలోని నిడమర్రులో ప్రచారాన్ని ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరిని సిపిఎం నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాజధానికి ఎనిమిది బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. ప్రజా ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయని, ఈ విధానాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రాజధాని రైతులు, అసైన్డ్ రైతులకు పెండింగ్ కౌలును చెల్లించాలని, రాజధాని పేదలకు ఇస్తున్న సామాజిక పింఛనును రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు సెంట్లు ఇళ్ల స్థలం, ఇళ్లకు రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం, నివాస ప్రాంతాల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. పన్నుల భారం తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లకు నిధులివ్వాలని, అసంఘటిత కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని కోరారు. గ్యాస్‌ను రూ.400కు, లీటరు పెట్రోల్ రూ.60కు, రూపాయికి యూనిట్ విద్యుత్ ఇవ్వాలన్నారు. ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని కోరారు. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించాలని, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్లపై సిపిఎం నిర్వహించే పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.భాగ్యరాజు, వి.వెంకటేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, ఎం.అంకమ్మరావు, కె.నానయ్య, ఎమ్మెల మరియదాసు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : నవంబర్ 15న విజయవాడలో నిర్వహించే ప్రజారక్షణ భేరికి తరలిరావాలని సిపిఎం పట్టణ నాయకులు వి.దుర్గారావు కోరారు. ఆదివారం నులకపేటలో ఎమ్మెల రామయ్య కాలనీలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి రోడ్డు, ఫ్లైఓవర్లు కాదని, అందరూ సమానంగా అసమానతల్లేకుండా జీవించాలని, అదే నిజమైన అభివృద్ధి అని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను అజెండా చేయడమే ప్రజా రక్షణ భేరి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్వరి, వెంకన్న, ఎం.దుర్గారావు, రమణ పాల్గొ న్నారు. సుందరయ్యనగర్‌లో నిర్వహించిన సమావేశానికి పి.రామచంద్రరావు అధ్యక్షత వహించగా మార్క్సిస్ట్ పత్రిక ఎడిటర్ ఎస్.వెంకట్రావు మాట్లాడారు. పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, పి.గిరిజ, సిహెచ్. భుజంగరావు, కె.ఉషారాణి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేసే ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయాలని, సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు అన్నారు. ఈ మేరకు ప్టోర్‌ను గుండిమెడలో ఆదివారం ఆవిష్కరించారు. శివశంకరరావు మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ విభజన హామీలు సాధించడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. బిజెపి ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజలకు నష్టం చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.కృష్ణ, ఎన్.విజయరాజు, బి.సంసోను, చిన్న, దావీదు, జోనేషు, రత్తయ్య పాల్గొన్నారు.