Sep 21,2023 20:02

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి గిరిజమ్మ

ప్రజాశక్తి - మంత్రాలయం
గ్రామాల్లో తాగునీటి సదుపాయం, రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలతో త్వరలో పనులు చేపట్టనున్నట్లు ఎంపిపి వై.గిరిజమ్మ తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ మణిమంజరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపిపి ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఈ నెల 30 నుంచి 15 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసిన తర్వాత జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక వైద్యాధికారుల ద్వారా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడమే కాకుండా కాన్పులు చేయడం అభినందనీయమని చెప్పారు. నెలకు 20 కాన్పులు చేస్తున్నారని, గర్భిణులు ప్రభుత్వాస్పత్రిలో కాన్పులు చేసుకుని సంక్షేమ పథకాలు పొందాలని కోరారు. కల్లుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాగునీటి పైపు లైన్‌, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సహకారంతో మండలంలో సచివాలయ భవనాల నిర్మాణాల్లో భాగంగా 20కి గాను 18 భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, 10 పూర్తయ్యాయని తెలిపారు. 25 ఆర్‌బికెలు ఉండగా 4 పూర్తయి 1 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలు 19 మంజూరు కాగా 8 నిర్మాణంలో ఉండగా 3 పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఉపాధి ద్వారా రూ.60 లక్షల నిధులు మంజూరవుతాయని, ఆర్‌డబ్ల్యుఎస్‌కు రూ.30 లక్షలు, పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.30 లక్షలు కేటాయించి, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి, సిసి రోడ్లు, డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సర్పంచి తెల్లబండ్ల భీమయ్య పాల్గొన్నారు.
వాస్తవాలు తెలుసుకుని ఎమ్మెల్యేను విమర్శించాలి
- వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు విశ్వనాథ్‌ రెడ్డి

టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి గత చరిత్ర మరిచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని విమర్శిస్తున్నారని వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సి.విశ్వనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం అభివృద్ధి చేస్తున్నందుకే మూడు సార్లు గెలుపించుకున్నారని తెలిపారు.