ప్రజాశక్తి - పార్వతీపురం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్ది కాకినాడ జిల్లా సామర్లకోటలో ప్రారంభించగా, జిల్లాస్థాయిలో పార్వతీపురం మండలం కృష్ణపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిధిలుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల విలువ రూ.488కోట్లు కాగా, సిమెంట్, ఇనుము సబ్సిడీ ధరకు ఇవ్వడం వల్ల రూ.550కోట్లు వెచ్చిస్తూ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల కృషితో రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఇంకా పునాదులు, ఆపై స్థాయిలో ఉండే గృహాలు ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు కావాల్సిన వారు ఇంకా ఉన్నారని ఎంఎల్‌ఎ తెలిపారని, వారందరికీ ఖాళీలు చూసి 90 రోజుల్లోగా భర్తీ చేసి పట్టాలు ఇవ్వాలని ఆర్‌డిఒను కలెక్టర్ ఆదేశించారు. ఈ కాలనీలో ఇంకా ఎవరికైనా ఇంటి స్థలాలు అవసరమైతే రెండు వారాల్లోగా మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరా కోసం బిసి కాలనీలో 150 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే ఆ పనులు పూర్తిచేయిస్తామని అన్నారు. ఐటిడిఎ పరిధిలోని మండలాలకు రూ.1.20కోట్లు, ఇతర అర్బన్ మండలాలకు రూ.60 లక్షలు చొప్పున నరేగా నిధులు మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. జిజిఎంపీ కింద మరో రూ.20 లక్షలు మంజూరు కానున్నట్లు తెలిపారు. కాలనీలోని సిసి రోడ్లకు మంజూరు ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.90 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే చెప్పారని, వాటికి టెండర్లు పిలిచి రానున్న 3 మాసాల్లోగా పనులు పూర్తిచేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులను ఆదేశించారు. మరో మూడు మాసాల్లో ఇచ్చిన హామీలన్ని పూర్తికావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కృష్ణపల్లిలో 4.80 ఎకరాల్లో 124 మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇంకా అర్హులుంటే ఖాళీ స్థలాల్లో వారికి మంజూరుచేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి సామూహిక గృహాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఆర్‌డిఒ కె.హేమలత, టిడ్కో చైర్‌పర్సన్ ప్రసన్నకుమార్, గృహ నిర్మాణ సంస్థ బోర్డు డైరెక్టర్ భోగిలత, పథక సంచాలకులు టి.రమేష్, బలిజిపేట, సీతానగరం ఎంపిపిలు గుడివాడ నాగమణి, బలగ రమణమ్మ, ఎఎంసి చైర్మన్ మరడాన భాగ్యశ్రీ, మునిసిపల్ వైస్‌ఛైర్మన్లు ఇండుపూరు గున్నేష్, కొండపల్లి రుక్మిణి, వైస్ ఎంపిపి బి.రవికుమార్, జెడ్‌పిటిసిలు రేవతమ్మ, రవికుమార్, బాబ్జీ, కృష్ణపల్లి ఉప సర్పంచ్ లంక శ్రీదేవి, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.










