Sep 25,2023 21:50

రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కేక్‌కట్‌ చేస్తున్నజెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో రూ.52కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సిఇఇ కె.రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఛైర్మన్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్‌ నుంచి సుమారు రూ.51.74 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తాగునీరు, రహదారుల నిర్మాణానికి అత్యధికంగా నిధులు వెచ్చించామన్నారు. ఉపాధి నిధులను సక్రమంగా, సకాలంలో వినియోగించుకొని, ప్రాధాన్యత పనులు పూర్తి చేశామన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా సుమారు రూ.వెయ్యి కోట్లతో ఉమ్మడి జిల్లాలో దశలవారీగా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దీనిలో భాగంగా ఇప్పటివరకు సుమారు రూ.వంట కోట్లు వరకు ఖర్చు చేశామని చెప్పారు. అక్టోబరు నాటికి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 46 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను కల్పించామన్నారు. సమావేశంలో పలువురు జెడ్‌పిటిసి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.