ప్రజాశక్తి-పెందుర్తి: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తోందని, ఆ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవ్వాలని ఎపి మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి అత్తిలి విమల డిమాండ్ చేశారు. ఈ మేరకు సుజాతనగర్ జంక్షన్‌లో ఎపి మహిళా సమాఖ్య ఆధ్వర్యాన కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను తక్కువ ధరకు కంపెనీలకు కట్టబెట్టి, రూ.400 ఉన్న సిలిండర్ ధరను భారీగా పెంచి సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ధరలు తగ్గిస్తామన్న బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదలు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేశారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నా యన్నారు. కార్పొరేట్ కంపెనీల ఆస్తుల పెంచటమే ప్రస్తుత పాలకవర్గాలు ఎజెండాగా మార్చుకున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య పెందుర్తి ఏరియా అధ్యక్షులు ఎన్.అరుణ, కార్యదర్శి అన్నపూర్ణ, రజిని, మహిళలు పాల్గొన్నారు.










