ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన సూక్ష్మ పోషక ఎరువులను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువల రూ.50 లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక సత్తెనపల్లి రోడ్డు వాసవి బహుళ దుకాణ సముదాయంలో షాపు నెం.114, 175లో వ్యవసాయ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల గురువారం తనిఖీలు చేపట్టగా ఎరువులతోపాటు ముడిపదార్థాలనూ స్వాధీనం చేసుకున్నట్లు అగ్రికల్చర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వాసంతి తెలిపారు. శ్రీ ధరణి అగ్రిటెక్ పేరుతో మార్కెటింగ్‌కు మాత్రమే అనుమతులున్నా ప్యాకింగ్ చేసి మరీ అక్రమంగా విక్రయిస్తున్నట్లు తేలింది. గోదాము యజమాని కె.సురేష్‌కు పలుమార్లు ఫోన్ చేయగా తిరుపతిలో ఉన్నానని, తాళాలు తమ గుమస్తాలతో పంపిస్తానని చెప్పి నుండి సాయంత్రం వరకు రాకపోవడంతో అధికారులు గోదాము తాళాలు పగలగొట్టి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వారి శ్రీనిధి లైసెన్స్ పేరుతో నరసరావుపేటలో అక్రమంగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారని, సంబంధిత వ్యక్తిపై సివిల్, క్రిమినల్ కేసులతోపాటు 6ఎ కేసు కూడా నమోదు చేస్తామని వాసంతి తెలిపారు. ప్యాకింగ్ మిషన్‌లు, ప్యాకింగ్ చేసిన సూక్ష్మ పోషకాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు, కల్తీలపై సమాచారం ఉంటే 8008203288కు తెలపాలని వాసంతి కోరారు. నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపుతామని, కల్తీవని తేలితే కఠిన చర్యలుంటాయని మండల వ్యవసాయాధికారి వి.నరేంద్రబాబు చెప్పారు. తనిఖీలలో విజిలెన్స్ ఎస్.ఐ రామచంద్రారెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.










