Oct 07,2023 21:30

ప్రజాశక్తి - ఏలూరు
          నెలకు రూ.నాలుగు వేలు జీతం కూడా ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు అన్నారు. మున్సిపల్‌ స్కూల్‌ స్వీపర్ల ఐదు నెలల జీతాల కోసం డిఇఒ కార్యాలయం వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని ఐదో రోజు శనివారం రామ్మోహన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకూ రోజుకు పది గంటలు పని చేయించుకుంటూ ఇవ్వాల్సిన రూ.నాలుగు వేలు జీతం కూడా సకాలంలో ఇవ్వకపోవడం దారుణమన్నారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం, హైకోర్టు తీర్పు ప్రకారం నెలకి రూ.ఎనిమిది వేలు ఇవ్వాల్సి ఉండగా అందులో సగంజీతం మాత్రమే చెల్లిస్తూ, అవికూడా సకాలంలో ఇవ్వకపోవడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. స్కూల్‌ స్వీపర్ల బకాయి జీతాలు తక్షణం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్కూల్‌ స్వీపర్ల బకాయి జీతాల కోసం చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ పూర్తిమద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు పట్టించుకుని పరిష్కారం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ నేత బాబు ప్రసాద్‌ పాల్గొని తన మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ గౌరవ అధ్యక్షులు బి.సోమయ్య, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు, కెవిపిఎస్‌ నాయకులు పి.బాలరాజు కూడా పాల్గొన్నారు.
మున్సిపల్‌ స్కూల్‌ స్వీపర్ల భిక్షాటన
మున్సిపల్‌ స్కూల్‌ స్వీపర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. తమ ఐదు నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ స్థానిక డిఇఒ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్‌ వరకూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఖాళీ కంచాలతో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసి 15 మాసాలవుతున్నా విద్యాశాఖ అధికారులు స్కూల్‌ స్వీపర్ల జీతాలు చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి జీతాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్నాథరావు, వి.సాయిబాబు, ఆటో డ్రైవర్ల యూనియన్‌ జిల్లా ప్రధానకార్యదర్శి జె.గోపి, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబు, కెవిపిఎస్‌ నాయకులు పి.బాలరాజు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ బిక్షాటన కార్యక్రమానికి స్కూల్‌ స్వీపర్లు జె.స్వాతి, చలమల విజయలక్ష్మి, ఎస్‌.కృష్ణవేణి భాస్కర్‌, వెంకటరమణ, పద్మజ, చిట్టెమ్మ, దుర్గమ్మ, హఫీజ్‌ ఉన్నీసా, నూర్జహాన్‌, లక్ష్మీరాజ్యం, రమణమ్మ, నాగమణి, ఆదిలక్ష్మి, జగలక్ష్మి, రామలక్ష్మి, రత్నమణి, జ్యోతి, మాధవి, జ్ఞానేశ్వరి నాయకత్వం వహించారు.