Jun 19,2023 01:04

ఉండవల్లిలో బిల్లు ప్రతులను దహనం చేస్తున్న నాయకులు, స్థానికులు

ప్రజాశక్తి - దుగ్గిరాల : విద్యుత్‌ బిల్లుల పెరుగుదలపై మండలంలోని మంచికలపూడిలో ప్రజలను సిపిఎం నాయకులు ఆదివారం కలిసి బిల్లులను పరిశీలించారు. బిల్లులు విపరీతంగా పెరిగాయని, గతంకంటే రెట్టింపు వచ్చిందని నాయకుల ఎదుట పలువురు వాపోయారు. ఇంత మొత్తంలో బిల్లుల చెల్లించలేకపోతున్నామని అన్నారు. యేమినేని కోటేశ్వరరావు బిల్లును పరిశీలించగా 87 యూనిట్లు విద్యుత్‌ వాడుకున్నందుకు రూ.488 బిల్లు వచ్చింది. ఇందులో అసలు బిల్లు రూ.291 కాగా ఇతర ఛార్జీలు 197.48గా ఉంది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రజలపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోందని, విద్యుత్‌ ఛార్జీల ద్వారా నిలువుదోపిడీకి దిగిందని విమర్శించారు. ట్రూ అప్‌, సర్దుబాటు, ఎఫ్‌పిపిసిఎ తదితరాల పేరుతో అసలు కొంట ఇతర చార్జీలే అధికంగా వసూలు చేస్తోందని, ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు ఏమిటని ప్రశ్నించారు. 2014 నుండి 2019 వరకు వినియోగించుకున్న కరెంటుకు ప్రజలు ఆనాడే బిల్లు కట్టేసారని, కానీ ప్రభుత్వం రూ.2,900 కోట్ల లోటంటూ జనం నుండి 36 నెలల పాటు వసూలు చేయడానికి విద్యుత్తు నియంత్రణ మండలి ద్వారా అనుమతి పొందారని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాడుకున్న కరెంటుకు కట్టిన బిల్లు చాల్లేదని అదనంగా రూ.3083 కోట్లు ప్రజల వద్ద నుండి వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. ఈ నెల బిల్లులో 2021లో వాడుకున్న బిల్లు కూడా యూనిట్‌కి 20 పైసలు చొప్పున మళ్లీ వసూలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను తెచ్చిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా అమలు చేయడం వల్లే ఈ బిల్లులు వస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అందించే విద్యుత్తు మొత్తం 30 ఏళ్ల పాటు ఆదాని కంపెనీ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. బొగ్గు, ఇంధనం ధరలను కార్పొరేట్లు పెంచుకొని కోట్ల రూపాయలు పోగు చేసుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారాలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేస్తున్న ఉద్యమాల్లో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నాయని, కీలకమైన దశలో అప్రకటిత విద్యుత్తు కోతలతో జనం అల్లాడిపోతున్నారని చెప్పారు. మరోవైపు ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు చూసి జనానికి షాక్‌ కొట్టిందని అన్నారు. వీటిని తగ్గించే వరకూ ఉద్యమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.స్టాలిన్‌, వై.బ్రహ్మేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, వై.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి దొంగదెబ్బ తీసిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య విమర్శించారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యుత్‌ బిల్లులను ఆదివారం రాత్రి ఉండవల్లిలో దహనం చేశారు. భాస్కరయ్య మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్ల పేరుతో మరో పిడుగు విద్యుత్‌ వినియోగదారుల నెత్తిపై పడనుందని, కార్పొరేట్ల లాభాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ భారాలు ప్రజలపై వేయనుందని చెప్పారు. మెడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగిన జగన్‌ ప్రభుత్వం వంట గ్యాస్‌ లాగానే ప్రతి నెలా విద్యుత్‌ చార్జీలు పెంచడానికి సిద్ధమైందని మండిపడ్డారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్‌ రంగాన్ని మూడు ముక్కలు చేసి సంస్కరణల పేరుతో జనం తిరగబడ్డ సంగతిని గుర్తు చేశారు. ఆ పోరాటం వల్ల తరువాత వచ్చిన వైఎస్‌ ప్రభుత్వంగానీ మరే ప్రభుత్వంగానీ పది సంవత్సరాల పాటు విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదని చెప్పారు. ఇప్పుడు దొడ్డిదారిన నాడు రాజశేఖరరెడ్డి తిరస్కరించిన విధానాలపై జగన్‌ అమలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు వి.వెంకటేశ్వరరావు, రామారావు, పార్ధసారధి, టి.శివయ్య, ఎం.సాంబశివరావు, ఒ.రమేష్‌, బి.మస్తాన్‌రావు, కె.వెంకటేశ్వరరావు, ఎస్‌.రాములు, అరుణ పాల్గొన్నారు.