ప్రజాశక్తి-మాడుగుల: రాష్ట్ర వ్యాప్తంగా రూ.435 కోట్ల రూపాయలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భవనాలు నిర్మిస్తున్నట్లు ఉన్నత విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. శుక్రవారం మాడుగుల వచ్చిన ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30 కళాశాలలకు రూ.14.5 కోట్ల చొప్పున భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అన్ని కళాశాలకు ఒకే డిజైన్‌తో నిర్మాణాలు జరుగుతాయని తెలిపారు. స్వంత భవనాలు లేని పలు కళాశాలలకు స్థలాలు ఏర్పాటు చేశామని, మాడుగుల కళాశాలకు ఇటీవల 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. కొంత కాలంగా మాడుగుల కళాశాలకు స్థల సమస్య ఉందని, యుజిసి నిబంధనల మేరకు అవసరమైన 5 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ప్రత్యేక ఎన్నికల అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితాలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన, వివాహమై అత్తింటికి వెళ్ళిన వారి పేర్లను సరి చేయవలసి ఉందన్నారు. ఓటర్ల జాబితా నుండి మరణించిన వారి పేర్లు కూడా తొలగించి తుది జాబితా తయారు చేయాల్సి ఉందని తెలిపారు. వివాదాలు రాకుండా ఉండేందుకు ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టాలని సూచించారు.
డిగ్రీ కళాశాల భాస్కర్ పరిశీలన
నక్కపల్లి:స్థానిక డిగ్రీ కళాశాలను రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ పోలా భాస్కర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుని డిగ్రీ కళాశాలలో ఉన్న అధ్యాపకులను ఇక్కడికి వచ్చి బోధించే విధంగా చూడాలని ప్రిన్సిపల్ కు సూచించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలకు స్థానిక మార్కెట్ సమీపంలో స్థలం అనుకూలంగా ఉంటుందని మండల పరిషత్ ఉపాధ్యక్షులు వీసం నానాజీ పోలా భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థలాన్ని పరిశీలించి వేగవంతంగా నివేదిక అందజేయాలని తహశీల్దార్ సుబ్రమణ్యం శాస్త్రిని ఆదేశించారు. అనంతరం ఆయన హైస్కూల్లోని రెండు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ప్రసాద్, ఎలక్షన్ డిటి తాతాచార్యులు పాల్గొన్నారు.










